Begin typing your search above and press return to search.

భర్త మోసం చేస్తే.. భార్యను చెట్టుకు కట్టేసి హింసించటమా?

నాగరిక సమాజంగా మనకు మనం చెప్పుకుంటాం కానీ ఎంత అనాగరికంగా వ్యవహరిస్తుంటామనే దానికి నిదర్శనంగా కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

By:  Garuda Media   |   9 April 2026 10:00 AM IST
భర్త మోసం చేస్తే.. భార్యను చెట్టుకు కట్టేసి హింసించటమా?
X

నాగరిక సమాజంగా మనకు మనం చెప్పుకుంటాం కానీ ఎంత అనాగరికంగా వ్యవహరిస్తుంటామనే దానికి నిదర్శనంగా కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. ఎంత భర్త తప్పు చేస్తే మాత్రం.. భార్యను శిక్షిస్తారా? అది కూడా ఆటవిక పద్దతిలో? ఈ ఉదంతం గురించి తెలిసినా.. దీనికి సంబంధించిన ఫోటోను చూసినా.. మనసంతా చేదుగా అయిపోవటం ఖాయం.

పెద్ద వయసులో ఉన్న మహిళ.. గ్రామంలో అంగన్ వాడీ టీచర్ గా బాధ్యతలు నిర్వర్తించే పెద్దావిడను.. అనాగరికంగా.. చెట్టుకు తాళ్లతో కట్టేసి హింసించిన వైనం చూస్తే.. దేవుగా అని అనుకోకుండా ఉండలేం. ఇదంతా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించింది ఎవరు? ఆ భర్త చేసిన అంత మోసం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దామరగిద్ద గ్రామానికి చెందిన వసంతకుమారి రాసోల్ గ్రామంలో అంగన్ వాడీ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వసంతకుమారి భర్త ప్రభాకర్. ఈ మధ్యన అతను హెచ్ బీఎం ఫైనాన్స్ పేరుతో గ్రామానికి చెందిన కొందరు (సాయవ్వ, బాలమణి, వైద్యనాథ్, బండ్యప్ప, రాములు) కలిసి గ్రూపుగా నిర్వహించే ఫైనాన్స్ సంస్థలో అప్పు తీసుకున్నాడు.

వాటిని తిరిగి చెల్లించకుండా మోసం చేసి పారిపోయాడు. దీంతో.. తాము ఆర్థికంగా నష్టపోయామన్న ఆగ్రహంతో అంగన్ వాడీ టీచర్ గా విధులకు హాజరైన వసంతకుమారిని తాళ్లతో చెట్టుకు కట్టేసి.. అవమానపరిచారు. ఈ విషయం గురించిన తెలుసుకున్న గ్రామపెద్దలు జోక్యం చేసుకొని ఆమెను విడిచిపెట్టారు. ఆమెను చెట్టుకు కట్టేసిన ఫోటోలు వాట్సాప్ గ్రూపులో పెద్ద ఎత్తున షేర్ అయ్యాయి. తనకు జరిగిన అవమానంపై తాజాగా ఆమె పోలీస్ స్టేషన్ లోకంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా.. భర్త తప్పు చేస్తే..అంత పెద్ద వయసులో ఉన్న భార్యను అలా అవమానిస్తారా? అన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.