బాలయ్య సనాతన ధర్మం..ఉత్తరాదిన ఊపుతుందా ?
బాలయ్య అఖండ సినిమాతో హైందవ ధర్మం గురించి కొంత వివరించారు. ఆ సినిమా నార్త్ లో రిలీజ్ కాలేదు, ప్రాంతీయ చిత్రంగానే దానిని విడుదల చేశారు.
By: Satya P | 29 Nov 2025 6:40 AM ISTసనాతన ధర్మం అన్న మాట ఆ మధ్య దాకా ఒక్క బీజేపీ నోటనే వినిపించేది. ఆ పార్టీ మాత్రమే ఎక్కువగా మాట్లాడేది. అయితే రాజకీయాల్లో బీజేపీ ఎదిగిన తీరు గత మూడు దఫాలుగా అధికారంలో ఉన్న తీరూ చూసిన వారు అంతా నెమ్మదిగా తమదైన శైలిలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. గతంలో సనాతన ధర్మం అన్న మాట ఎవరైనా అంటే వారికి ఒక ట్యాగ్ తగిలించి విమర్శల జల్లు కురిపించేవారు. కానీ బీజేపీ అప్రతిహత విజయాలు చూసిన తరువాత దేశంలో మధ్యేవాద పార్టీలు తగ్గిపోయాక వామపక్ష వాదం కాంగ్రెస్ నినాదం ఉన్నా కూడా దానిని దాటి మరీ కాషాయ వ్యూహాలు విస్తరించిన వేళ సనాతన ధర్మం గురించి ఇపుడు మధ్యేవాద పార్టీలు గట్టిగా నినదిస్తున్నాయి అని అంటున్నారు.
బాలయ్య అఖండతో :
బాలయ్య అఖండ సినిమాతో హైందవ ధర్మం గురించి కొంత వివరించారు. ఆ సినిమా నార్త్ లో రిలీజ్ కాలేదు, ప్రాంతీయ చిత్రంగానే దానిని విడుదల చేశారు. అయితే టీవీ మాధ్యమాలలో ఉత్తరాదిన చూసిన జనాల నుంచి మంచి మద్దతు లభించింది. ఇపుడు అఖండ టూ పూర్తి స్థాయిలో సనాతన ధర్మం గురించి చర్చిస్తున్నారు అని అంటున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన వక్తలు అంతా ఎక్కువగా దాని గురించే మాట్లాడారు, ఇక టీజర్ చూసినా సాంగ్స్ విన్నా కూడా ఈ మూవీ అఖండ ని మించిన మెటీరియల్ తో వస్తోంది అని అర్థం చేసుకుంటున్నారు.
ఉత్తరాది గురి :
ఈ నేపథ్యంలో అఖండను ఉత్తరాది రాష్ట్రాలను కూడా గురి పెడుతూ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ మూవీకి బీజేపీ మద్దతు ఏ మేరకు ఉంటుంది అన్న చర్చ ఉంది. సహజంగా ఇలాంటి సినిమాలకు కమలనాధులు తమ సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇక అఖండ టీం అయితే యూపీ సీఎం బీజేపీ కీలక నేత యోగి ఆదిత్య నాధ్ ని కలసి వచ్చింది. మరో వైపు ఉత్తరాది మార్కెట్ మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. దాంతో ఈ మూవీ విషయంలో కనుక అక్కడ బీజేపీ నుంచి సహకారం ఉంటే వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
కూటమి సైతం :
ఇక కూటమిలో కీలకంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఏడాది తిరుమల లడ్డూల విషయంలో కల్తీ జరిగింది అన్న దాని మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సనాతన ధర్మం గురించి తొలిసారి ప్రస్తావించారు. ఇక ఆయన తాజాగా కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత గురించి కూడా మరోసారి గుర్తు చేశారు. ఆ విధంగా చూస్తే బీజేపీ టీడీపీ జనసేన కూటమి సైతం కొంత ఏకీకృత భావజాలంతోనే ముందుకు సాగుతోంది బాలయ్య అయితే టీడీపీ ఎమ్మెల్యే కూడాను. ఇలా అన్ని విధాలుగా ఇపుడు అనుకూలత ఉన్న వేళ బాలయ్య అఖండ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతోంది. మరి ఈ మూవీ నార్త్ లో ఏ రకమైన కలెక్షన్స్ రాబడుతుంది అన్నదే చర్చగా ఉంది.
