జపాన్ కొత్త ప్రధాని..అమెరికాతో ఢీ..చైనా విరోధి..మరి భారత్ తో?
ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థలు.. అమెరికా, చైనా, జపాన్..! ఆ తర్వాత స్థానాలు జర్మనీ, భారత్ వి. భవిష్యత్ లో మొదటి రెండు దేశాలను దాటేసే సత్తా ఉన్నది జపాన్ కే అన్నది ఆర్థిక నిపుణుల అంచనా.
By: Tupaki Political Desk | 8 Oct 2025 1:00 AM ISTప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థలు.. అమెరికా, చైనా, జపాన్..! ఆ తర్వాత స్థానాలు జర్మనీ, భారత్ వి. భవిష్యత్ లో మొదటి రెండు దేశాలను దాటేసే సత్తా ఉన్నది జపాన్ కే అన్నది ఆర్థిక నిపుణుల అంచనా. అలాంటి దేశానికి తొలిసారి ఓ మహిళ ప్రధాని అయ్యారు. ఒకప్పటి బైకర్ అయిన సనే తకైచిని ఐరన్ లేడీ అని ప్రజలు గర్వంగా సంబోధిస్తుంటారు. నేషన్ ఫస్ట్.. ఇదేదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నినాదం కాదు.. తకైచీ మాట కూడా ఇదే. 64 ఏళ్ల తకైచి... అమెరికాతో వాణిజ్య ఒప్పందం వంటి అతి కీలక అంశాల్లోనూ తమ దేశానికి నష్టం అని తెలిస్తే వెంటనే చర్యలు తీసుకోవడానికి వెనుకడారనే పేరుంది.
కాలేజీ హెవీ మెటల్ బ్యాండ్ డ్రమ్మర్...
ఒకప్పుడు కాలేజీ హెవీ మెటల్ బ్యాండ్ లో డ్రమ్మర్ అయిన తకైచీ రాజకీయాల్లోనూ బైక్ రేసింగ్ తరహాలో దూసుకెళ్తారు. వలసలపై కఠిన వైఖరి, పసిఫిక్ మహా సముద్రంలో చైనా సైనిక నిర్మాణం, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భవిష్యత్ లో జపాన్ యుద్ధాల్లో పాల్గొనకుండా ఉన్న నిషేధాన్ని తొలగించే అంశంపై చర్యల విషయమై తకైచీ పట్టుదలగా ఉన్నారు.
భారత్ కు మిత్రురాలే...
చైనా అంటే వ్యతిరేకత కనబరిచే తకైచీ... భారత్ కు మిత్రురాలు అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈమె రాజకీయ గురువు మాజీ ప్రధాని షింజో అబే. భారత్ కు మంచి స్నేహితుడైన, లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో కీలక నాయకుడైన అబేను కొన్నేళ్ల కిందట దుండగుడు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అబే మార్గదర్శకత్వంలోనే తకైచీ ఎదిగారు. ఆర్థిక మంత్రిగానూ పనిచేసిన తకైచీ.. ద్రవ్య సడలింపు, పెరిగిన వ్యయాలపై తనదైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్-జపాన్ సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ఆమె లిఖిస్తారని భావిస్తున్నారు.
