సాలూరు టీడీపీలో పొలిటికల్ పంచాయితీ.. !
ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం టీడీపీలో సెగలు పొగలు కనిపిస్తున్నాయి.
By: Garuda Media | 13 March 2026 6:00 PM ISTఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం టీడీపీలో సెగలు పొగలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి.. సీనియర్ నేతలకు మధ్య ఎక్కడా పొసగడం లేదని అంటున్నారు. అంతే కాదు.. ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. సీనియర్లపై మంత్రి కక్షసాధిస్తున్నారని.. మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ వ్యాఖ్యలు చేస్తుండడంతో పార్టీలో ఐక్యత దెబ్బతిందన్న వాదన వినిపిస్తోంది.
మంత్రి సంధ్యారాణి పీఏపై `మహిళా` ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆమెకు పరోక్షంగా భంజ్‌దేవ్ సహకరించారని మంత్రి వర్గం ఆరోపిస్తోంది. ఆమెకు ఆయన టచ్‌లో ఉన్నారని.. కేసులు పెట్టాలని ప్రోత్సహించడంతోనే..ఆమె మీడియా ముందుకు వచ్చి కేసులు పెట్టారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న వివాదాల కు ఇది మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఈ పరిణామాలతో మంత్రికి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని కూడదీస్తూ.. భంజ్ దేవ్.. తన సత్తా నిరూపించుకుంటానని చెబుతున్నారు.
తాము నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలా? వద్దా? అనేది ఆయన ప్రశ్న. పార్టీ పరంగా ముందు నుంచి తాము యాక్టివ్‌గా ఉండడం వల్లే పార్టీ బలోపేతం అయిందని.. సంధ్యారాణి రాజకీయాల వల్ల కాదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. గతంలో మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుకు వ్యతిరేకంగా చక్రం తిప్పి.. ఆమె రాజకీయంగా టీడీపీని బలహీనపరిస్తే.. తాము పార్టీని దగ్గరుండి డెవలప్ చేశామని భంజ్‌దేవ్ చెబుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు.. గతంలో జరిగిన పరిణామాలను ముడిపెట్టి నియోజకవర్గంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడంమరింత కలకలం రేగుతోంది. అయితే.. రాత్రికి రాత్రి ఫ్లెక్సీలను తొలగించారు. వీటిపై కూడా.. భంజ్ దేవ్ ఆగ్రహంతోనే ఉన్నారు. రాజకీయంగా పైచేయిసాధించడం ద్వారా తమను వాల్యూలేకుండా చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఈ పరిణామాలను ముఖ్యమంత్రి దగ్గరే తేల్చుకుంటామని ఆయన చెబుతున్నారు. దీంతో సాలూరు టీడీపీలో రాజీకయ దుమారం రేగినట్టు అయింది.
