నీట్ పేపర్ లీక్: సల్మాన్ ఖాన్ తొలి స్పందన.. బాలీవుడ్ ప్రముఖులు కీలక వ్యాఖ్యలు?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విద్యార్థులకు తన మద్దతును ప్రకటించారు.
By: A.N.Kumar | 23 July 2026 11:35 AM ISTదేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను రూపొందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు ఎక్కువగా మౌనంగా ఉన్న సినీ, వినోద రంగానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా విద్యార్థుల ఆవేదనపై స్పందిస్తూ వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
సమతుల్యమైన రీతిలో స్పందించిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విద్యార్థులకు తన మద్దతును ప్రకటించారు. "పేపర్ లీక్ అనేది అత్యంత తీవ్రమైన సమస్య. మెరుగైన విద్యా వ్యవస్థ కోసం దేశంలోని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఒక్కటిగా నిలబడటం అభినందనీయం. అయితే ప్రశాంతంగా సాగుతున్న ఈ ఉద్యమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగి హింసాత్మకంగా మారడం నన్ను తీవ్రంగా బాధించింది. గాయపడిన వారికి, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ ఆందోళనలను రాజకీయంగా ఉపయోగించుకోకూడదని సల్మాన్ స్పష్టం చేశారు. "ఇది విద్యార్థులు, విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్య. దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు. ఈ ఉద్యమానికి పూర్తి క్రెడిట్ విద్యార్థులకే చెందాలి. ప్రభుత్వం కూడా వారికి అండగా నిలిచి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.
స్పందించిన సినీ ప్రముఖులు.. దుల్కర్ సల్మాన్, ఇంతియాజ్ అలీ, అదితిరావు
సల్మాన్ ఖాన్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా విద్యార్థుల తరఫున గళమెత్తారు. దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేస్తూ "విద్య అంటే ఆశ, మెరుగైన భవిష్యత్తుకు నమ్మకం. యువత ఇలా అనిశ్చితిని ఎదుర్కోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆందోళనలు ఆగేందుకు అధికారులు విద్యార్థుల ఆవేదనను విని, శాంతియుతమైన అర్థవంతమైన చర్చలు జరపాలి" అని ఆకాంక్షించారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ "మన భవిష్యత్తు బాగుండాలంటే మనం చేయాల్సిందల్లా విద్యార్థుల మాటలు వినడమే" అని పేర్కొన్నారు. అదితిరావు హైదరీ కూడా స్పందించారు. "నేను ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా మాట్లాడుతున్నాను. కష్టాల్లో ఉన్నవారికి మద్దతుగా నిలవడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవు, ఇది కేవలం మానవత్వం" అని స్పష్టం చేశారు. వీరితో పాటు పూజా భట్, సోనాక్షి సిన్హా, షబానా అజ్మీ, అర్జిత్ సింగ్, అనుపమ్ ఖేర్ తదితరులు విద్యార్థులకు మద్దతు తెలిపారు.
ప్రధాని మోదీ కీలక ప్రకటన
మరోవైపు ఈ వ్యవహారంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల సంక్షేమం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. పేపర్ లీక్ ఘటనలో దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ , ఇతర ప్రముఖుల వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ సమస్యపై నోరు విప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు.
