సల్మాన్ ఖాన్ కి లీగల్ నోటీసులు.. విచారణ ఆ రోజే!
అయితే తాజాగా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ పై కోట వినియోగదారుల కోర్టులో బిజెపి సీనియర్ నాయకుడు ఫిర్యాదు చేశారు.
By: Madhu Reddy | 5 Nov 2025 12:19 PM ISTచాలామంది సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలైతే పాన్ మసాలా యాడ్స్ చేస్తూ ఉంటారు. ఈ పాన్ మసాలా యాడ్స్ చేయడం వల్ల చాలామంది హీరోలపై విమర్శలు వచ్చాయి. షారుక్ ఖాన్,అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు కోట్లు ఉన్నా సరే ఇలాంటి పాన్ మసాలా యాడ్లు ఎందుకు చేస్తారు? మిమ్మల్ని ఎంతో ప్రేమించే అభిమానులను మీరు తప్పుదారి పట్టిస్తున్నారా ? అని ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ యాడ్స్ చేయడం మానడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ పై కోట వినియోగదారుల కోర్టులో బిజెపి సీనియర్ నాయకుడు ఫిర్యాదు చేశారు. సల్మాన్ ఖాన్ చేసిన రాజశ్రీ పాన్ మసాలా ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి అంటూ ఫిర్యాదు చేశారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మరియు రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది అయినటువంటి ఇందర్ మోహన్ సింగ్ హనీ దాఖలు చేసిన ఫిర్యాదులో ఏముందంటే.. రాజశ్రీ పాన్ మసాలాను తయారు చేసే కంపెనీ, దాని బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు.అంతేకాదు కుంకుమపువ్వు, యాలకులు కలిపిన మిశ్రమం పాన్ మసాలా రాజశ్రీ పాన్ మసాలాలో ఉంటాయని సల్మాన్ ఖాన్ తప్పుడు ప్రచారం చేశాడు. ఆయన చేసిన తప్పుడు ప్రచారం వల్ల చాలామంది ఈ పాన్ మసాలాని తినే అవకాశం ఉంది.
ఇలా తప్పుదారి పట్టించే ప్రకటన సల్మాన్ ఖాన్ చేయడం ఆయన అభిమానులను కూడా తప్పుదారి పట్టించినట్లే. అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు కుంకుమపువ్వు కిలోకు దాదాపు 4 లక్షల ఖరీదు చేస్తుంది. అంత కాస్ట్లీ అయినటువంటి కుంకుమపువ్వు కేవలం 5 రూపాయల ధర ఉన్న పాన్ మసాలాలో ఉంటుంది అంటే ఎవరికి నమ్మశక్యం కావడం లేదు.
ఇటువంటి తప్పుదారి పట్టించే ప్రకటనలు సల్మాన్ ఖాన్ చేస్తూ యువతను పాన్ మసాలా తినేలా ప్రభావితం చేస్తున్నారని, ఇలాంటి పాన్ మసాలాలు తినడం వల్ల క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతాయని బిజెపి సీనియర్ నాయకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సల్మాన్ ఖాన్ చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సల్మాన్ ఖాన్ కి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక రాజశ్రీ పాన్ మసాలా కంపెనీ మరియు దాని బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి హీరో సల్మాన్ ఖాన్ ఈ పాన్ మసాలాలో కుంకుమపువ్వు ఉందని దీన్ని కచ్చితంగా యువత తినాలి అని ప్రోత్సహించేలా యాడ్ చేశారు.
ఇలాంటి యాడ్లో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయినటువంటి హీరో సల్మాన్ ఖాన్ చేయడం వల్ల చాలామంది యువత ఆ పాన్ మసాలాకు అట్రాక్ట్ అవుతారు. అందుకే ఈ పాన్ మసాలా యాడ్ పై కోటా కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసాము. అలాగే విచారణ కోసం సల్మాన్ ఖాన్ కి నోటీసులు జారీ చేయబడ్డాయి అంటూ బిజెపి సీనియర్ నాయకుడు న్యాయవాది అయినటువంటి ఇందర్ మోహన్ సింగ్ హనీ తెలిపారు. కోట కన్స్యూమర్ కోర్టు బిజెపి సీనియర్ నాయకుడు ఇందర్ మోహన్ సింగ్ హనీ చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని నవంబర్ 27 న విచారణకు రావాలని సల్మాన్ ఖాన్ కి లీగల్ నోటీసులు పంపింది కోర్ట్.
