విజయవాడ సాక్షి ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు
విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న సాక్షి మీడియా ప్రధాన కార్యాలయంలో అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు.
By: A.N.Kumar | 2 Sept 2025 10:22 AM ISTవిజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న సాక్షి మీడియా ప్రధాన కార్యాలయంలో అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. సోమవారం అర్థరాత్రి 12.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు పోలీసులు అక్కడ శోధన చర్యలు చేపట్టారు.
పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.., తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో సాక్షి పత్రికపై కేసు నమోదు కావడంతో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సాక్షి ఎడిటర్‌తో పాటు పత్రికలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులపై వివిధ సెక్షన్ల కింద FIRలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్థరాత్రి సమయంలో మీడియా సంస్థపై పోలీసులు సోదాలు చేయడం పట్ల పాత్రికేయ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పోలీసుల ఈ చర్యపై ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. మరోవైపు సాక్షి ప్రతినిధులు మాత్రం తమపై అక్రమ కేసులు పెట్టి, వాయిస్‌ను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
మొత్తం మీద సాక్షి ప్రధాన కార్యాలయంలో అర్థరాత్రి జరిగిన ఈ సోదాలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది.
సాక్షి ఎడిటోరియల్ సిబ్బందిపై పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు
సాక్షి పత్రికలో తాజాగా ప్రచురితమైన కథనం పై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. "పైసామే ప్రమోషన్" శీర్షికన ప్రచురించిన ఈ కథనంలో, పోలీసు శాఖలో పదోన్నతుల కోసం డబ్బులు లావాదేవీ జరుగుతున్నట్లు ఆరోపణలు చేస్తూ రాయడం జరిగింది.
ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు స్వయంగా ముందుకు వచ్చి సాక్షి ఎడిటోరియల్ సిబ్బందిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ కథనం ద్వారా రాష్ట్ర డీజీపీని కించపరుస్తూ, పోలీస్ వ్యవస్థపై అవినీతి మచ్చ మోపే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.ఫిర్యాదు అందుకున్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
