‘మన సాయిరెడ్డి’ అని వదిలేశాం.. ఇక నుంచే వేరే ట్రీట్మెంట్.. సజ్జల స్ట్రాంగ్ రియాక్షన్
తనను కోటరీ నాయకుడు అంటూ విమర్శించడమే కాకుండా, నమ్మక ద్రోహి అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
By: Tupaki Political Desk | 30 Aug 2026 8:29 PM ISTతనను కోటరీ నాయకుడు అంటూ విమర్శించడమే కాకుండా, నమ్మక ద్రోహి అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం విడుదల చేసిన లేఖలో ప్రతి అంశంపై సజ్జల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని బలహీనపరచడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. జగన్మోహనరెడ్డి మత మార్పిడులను ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి ఆరోపించడం వాస్తవ దూరమని స్పష్టం చేశారు. మత మార్పిడులను ప్రోత్సహిస్తే ముందుగా విజయసాయిరెడ్డి మతమే మార్చుకునేవారు కదా? అంటూ సజ్జల ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన బహిరంగ లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖలోని అంశాలపై తాను స్పందించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో వివరణ ఇస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. గతంలో సాయిరెడ్డి తనను ఉద్దేశించిన చేసిన విమర్శలను పెద్దగా పట్టించుకోకపోయిన సజ్జల ఈ సారి మాత్రం కాస్త ఘాటుగానే ప్రతిస్పందించారు. పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయిన నేతలపై తాము ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెబుతూనే, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో ఎలాంటి కారణాలు చూపలేదని, సొంత కారణాలతోనే బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు.
వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు తెరపైకి వస్తాయని, ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే పాత్ర బయటకు వచ్చిందని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్న విజయసాయిరెడ్డి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందనే ఆలోచనతో ఆయన ఇలాంటి లేఖలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక తనను కోటరీ నాయకుడిగా అభివర్ణించడంపైనా సజ్జల ఫైర్ అయ్యారు. జగన్ కోటరీకి బంధీ అయితే పార్టీని ఈ స్థాయికి తీసుకు రాగలిగేవారా? అంటూ ప్రశ్నించారు. తమ పార్టీలో జగన్ ఒక్కరే నాయకుడు అని స్పష్టం చేశారు. జగన్ లేని వైసీపీ లేదే లేదని తేల్చిచెప్పారు. వైసీపీలో జగన్ నెంబరు 2 అయితే సజ్జల నెంబర్ వన్ అంటూ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలను ఈ సందర్భంగా ఆయన ఎత్తిచూపారు. ఇక తన ఎదుగుదలను అడ్డుకున్నారని విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపైనా సజ్జల వివరణ ఇచ్చారు. పార్టీలో ఎక్కువ పదువులు అనుభవించింది విజయసాయిరెడ్డి మాత్రమే అంటూ స్పష్టం చేశారు.
పార్టీలో విజయసాయిరెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చారు, ఉన్నతస్థానంలో కూర్చొబెట్టారు. రెండుసార్లు రాజ్యసభకు పంపారు, పార్టీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ సంఘాల ఇంచార్జి, పార్లమెంటరీ పార్టీ నేత, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఇలా విజయసాయిరెడ్డి ఎన్నో పదవులను అనుభవించారని గుర్తు చేశారు. తాను జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, విజయసాయిరెడ్డి కన్నా ముందే సాక్షిలో పనిచేశానని తెలిపారు. పార్టీలో రకరకాల వ్యక్తులు పనిచేస్తారని, వివిధ హోదాల్లో సేవలు అందిస్తారని వివరించారు. అంతా టీమ్ వర్క్ చేస్తేనే పార్టీ నిలుస్తుందన్న విషయాన్ని సజ్జల ఎత్తిచూపారు. విజయసాయిరెడ్డి ప్రతిభతో ఏ పదవి రాలేదని, అంతా జగన్మోహనరెడ్డి దయ, దాక్షిణ్యంతోనే ఆయనకు పదవులు వచ్చాయనే సంగతిని గుర్తు చేశారు.
విజయసాయిరెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకుంటామంటే ఎవరికీ అభ్యంతరం లేదని సజ్జల స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే హక్కు అందరికీ ఉందని ఉద్ఘాటించారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తే ఎక్కువ ప్రచారం వస్తుందనే ఉద్దేశంతోనే రాజకీయాలు చేయాలని అనుకోవడం మాత్రం సరికాదని హితవు పలికారు. ఇకపై వైసీపీపై విజయసాయిరెడ్డి దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటివరకు మన సాయిరెడ్డి అన్న భావనతోనే సంయమనం పాటించామని, ఇదే ధోరణి కొనసాగితే వేరే విధంగా ట్రీట్ చేస్తామని హెచ్చరించారు. ఇక తాను టీడీపీతో సంబంధాలు పెట్టుకుని కేసులు లేకుండా చేశానని విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపైనా సజ్జల స్పందించారు. ఈ ఆరోపణలతో ఆయన ఎటువైపు పయనిస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. విజయసాయిరెడ్డిపై భౌతికదాడి జరిగిందని చెబుతున్నారని, నిజంగా దాడి జరిగినట్లు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చనని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో పాత సంఘటనలపైనా కేసులు పెడుతున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించే అవకాశం ఉందన్నారు. మొత్తానికి సాయిరెడ్డి ఎపిసోడ్ పై వైసీపీ సీరియస్ గా స్పందించిందని సజ్జల వ్యాఖ్యలు ఆధారంగా అర్థమవుతోందని అంటున్నారు. సాయిరెడ్డి రాసిన రెండు పేజీల లేఖలో ప్రతి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా మాజీ ఎంపీ విమర్శల్లో పసలేదని సజ్జల తేల్చిచెప్పారని అంటున్నారు.

