Begin typing your search above and press return to search.

'రప్పా రప్పా అంటే... రెపరెపలాడుతూ మళ్లీ అధికారంలోకి'!

ఈ సమయంలో ఈ డైలాగ్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సరికొత్త అర్ధాన్ని చెప్పారు.

By:  Raja Ch   |   26 Nov 2025 12:48 PM IST
రప్పా రప్పా అంటే... రెపరెపలాడుతూ మళ్లీ అధికారంలోకి!
X

ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో నిలిచిన తర్వాత జరిగిన పలు రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు ‘పుష్ప-2’ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఆ సినిమాలోని "రప్పా రప్పా" అనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే! వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. జనాల్లోకి వచ్చిన దాదాపు ప్రతీసారీ, కార్యక్రమంతో సంబంధం లేకుండా అన్నట్లుగా 'రప్పా రప్పా' అని రాసి ఉన్న ఫ్లకార్డులు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. ఈ వ్యవహారం పీక్స్ కి చేరుకుంటుంది!

దీనిపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... ‘అది ‘పుష్ప’ సినిమాలో డైలాగ్.. అది చెప్పినా తప్పేనా స్వామీ.. గెడ్డం అలా అన్నా ఇలా అన్నా తప్పే, పుష్పా సినిమాలో డైలాగులు చెప్పినా తప్పేనా’ అంటూ ఈ విమర్శలపై జగన్ స్పందించారు. మరోవైపు... రాజకీయాల్లో ఈ తరహా డైలాగులు, వైఖరి ఏమాత్రం సమర్ధనీయం కాదని చెబుతూ.. ఈ ఫ్లకార్డులతో సమాజానికి ఏమి సందేహం ఇస్తున్నారంటూ కూటమి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

ఇక.. రాజకీయాల్లో ఈ తరహా వైఖరి ఏమాత్రం మంచిది కాదని, ఇలాంటి వైఖరిని ఆ పార్టీ అధినేత సమర్ధించకూడదని, నాయకులు వాటిని ప్రోత్సహించకూడదని.. ఈ తరహా వైఖరి వల్ల సమాజంలో చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో ఈ డైలాగ్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సరికొత్త అర్ధాన్ని చెప్పారు.

అవును... గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... జగన్ పర్యటనల్లో కనిపిస్తోన్న "రప్పా రప్పా" ఫ్లకార్డులపై స్పందించారు. ఇందులో భాగంగా... రప్పా రప్పా అంటే నరుకుతాం, చంపుతాం అని కాదని.. రప్పా రప్పా అంటే రెప రెప లాడుతూ రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ వస్తామని అర్ధమని చెప్పుకొచ్చారు.

తాజాగా ఈ విషయాలపై మాట్లాడిన ఆయన... రెప రెప లాడిస్తూ మేము వస్తామంటే.. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని.. తన్నుకుని వస్తారని.. ఒక ఊపుమీద అనే సినిమాలోని డైలాగ్ అది అని సజ్జల చెప్పుకొచ్చారు. దీన్ని పట్టుకుని దేవరా, జడ్జిలు, సీబీఐ అధికారులు తమను కాపాడండి అంటూ నానా యాగీ చేస్తున్నారని.. మరొకరు జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలని అంటున్నారని తెలిపారు!

దీంతో... ‘పుష్ప-2’ సినిమా డైలాగ్ రైటర్ శ్రీకాంత్ విస్సా సైతం.. నిజంగా ఈ డైలాగ్ పై సమస్య వచ్చుంటే సజ్జల తరహాలో సమర్ధించుకుని ఉండేవారు కాదని.. ఇది సజ్జలకే సాధ్యమంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు!