Begin typing your search above and press return to search.

కొత్త బాధ్యతల్లోకి సజ్జల భార్గవరెడ్డి..! ఇక వైఎస్ భారతీరెడ్డి కనుసన్నల్లోనే..

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగించారు.

By:  Tupaki Political Desk   |   3 Nov 2025 4:56 PM IST
కొత్త బాధ్యతల్లోకి సజ్జల భార్గవరెడ్డి..! ఇక వైఎస్ భారతీరెడ్డి కనుసన్నల్లోనే..
X

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో భార్గవరెడ్డిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రభుత్వం సజ్జల భార్గవరెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం, వరుస కేసులు నమోదవుతుండటంతో గత ఏడాది ఆగస్టులో పార్టీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి భార్గవరెడ్డిని తప్పించారు. దీంతో ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న భార్గవరెడ్డికి ఇప్పుడు మాజీ సీఎం జగన్ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా గ్రూపులో కీలక బాధ్యతలు అప్పగించారు.

పార్టీలో కీలకంగా పనిచేసిన భార్గవరెడ్డికి సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్ గా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇంతకుముందు పార్టీ సోషల్ మీడియాను పర్యవేక్షించిన భార్గవరెడ్డి ఇకపై సాక్షి మీడియాకు చెందిన పత్రిక, టీవీ చానల్ కు సంబంధించిన డిజిటల్ కంటెంట్ ను పర్యవేక్షిస్తారని చెబుతున్నారు. సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డికి సహాయకంగా ఉంటారని చెబుతున్నారు. భార్గవరెడ్డి తండ్రి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గతంలో సాక్షిలో పనిచేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉంటూనే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ బాధ్యతల్లోకి మారారని అంటున్నారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి కుమారుడిని సాక్షిలోకి తీసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

సజ్జల భార్గవరెడ్డికి మీడియా బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యాపార లక్ష్యాలు ఉన్నాయా? లేక రాజకీయ వ్యూహమా? అనే చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అత్యంత సన్నిహితంగా ఉంటుంది. జగన్ నమ్మినబంటులా పనిచేసే సజ్జల కుటుంబానికి ప్రాధాన్యమివ్వాలనే ఆలోచనతోనే భార్గవరెడ్డికి సాక్షి డిజిటల్ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. మరోవైపు ఆయనపై నమోదైన కేసుల నుంచి రక్షణకు కూడా ఈ నియామకం పనికొస్తుందన్న ఆలోచన కూడా ఉండివుంటుందని అంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉండగా, సజ్జల భార్గవరెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జిగా పనిచేశారు. పార్టీ ఓడిన తర్వాత కూడా కొన్నాళ్లు అదేబాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలో వైసీపీ సోషల్ మీడియాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను వ్యక్తిగతంగా దూషించడంతోపాటు కుటుంబ సభ్యులను అవమానించేలా పోస్టులు పెట్టారని కేసులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలపైన అనుచిత ప్రచారం చేశారని, దీనివెనుక భార్గవరెడ్డి పాత్ర ఉందని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదు అవ్వగా, అందులో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. కొన్ని కేసులపై కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ పరిస్థితుల్లో భార్గవరెడ్డికి సాక్షి డిజిటల్ హెడ్ బాధ్యతలు అప్పగించారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.