కొడుకు ఉగ్రవాది అయినా... తల్లికి మాత్రం బాబు బంగారమేగా!
సిడ్నీలోని బోండి బీచ్ లో యూదుల పండుగ సందర్భంగా జరిగిన వేడుకలు ఒక్కసారిగా తీవ్ర విషాదంగా మారిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 16 Dec 2025 1:00 AM ISTసిడ్నీలోని బోండి బీచ్ లో యూదుల పండుగ సందర్భంగా జరిగిన వేడుకలు ఒక్కసారిగా తీవ్ర విషాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హనుక్కా వేడుకల్లో పాల్గొన్న వందలాదిమందిపై ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా 16 మంది మృతి చెందారు. మరోవైపు నిందితులిద్దరూ తండ్రీకొడుకులను.. వీరిద్దరూ పాక్ నుంచి వచ్చారని, వీరి కారులో ఐ.ఎస్.ఐ.ఎస్. జెండా కనిపించిందనే కథనాలు వైరల్ గా మారాయి.
వీరిద్దరిలో ఒకరు సాజిద్ అక్రం (50) కాగా, అతని కుమారుడు నవీద్ అక్రం (24) అని పోలీసులు గుర్తించారు. అయితే.. భద్రతాదళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందగా.. నవీద్ మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో పోలీసుల భద్రత నడుమ చికిత్స పొందుతున్నాడు. అయితే.. వారు తమ కుటుంబ సభ్యులతో చేపల వేటకు వెళ్తున్నట్లు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. ఈ సందర్భంగా నవీద్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... బోండీ బీచ్ లో పాల్గొన్న ఉగ్రదాడికి కారకులైన తండ్రీకొడుకు తమ కుటుంబసభ్యులతో.. చేపల వేటకు వెళ్తున్నట్లు చెప్పారని అంటున్నారు. ఈ సమయంలో ఈ ఘటనకు కొన్ని గంటల ముందు తన కొడుకుతో జరిగిన సంభాషణ గురించి అతని తల్లి వెరీనా వెల్లడించారు. పశ్చిమ సిడ్నీలోని బోనిరిగ్ లోని వారి ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన అనంతరం.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన కుమారుని వద్ద తుపాకీ లేదని తెలిపారు.
ఆదివారం తనకు ఫోన్ చేసిన నవీద్ అక్రం... అమ్మా తాను ఇప్పుడే ఈతకు వెళ్లాను, స్కూబా డైవింగ్ కి వెళ్లాను అని చెప్పినట్లు ఆమె తెలిపారు. అనంతరం.. తాము ఉదయం తినడానికి వెళ్తున్నామని.. ఇప్పుడు చాలా వేడిగా ఉన్నందున ఇంట్లోనే ఉంటామని చెప్పడని చెబుతూ.. తన కొడుకు హింస, ఉగ్రవాదంలో పాల్గొన్నాడంటే తాను నమ్మలేకపోతున్నారని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో.. అతను బయటకు కూడా వెళ్లడని.. స్నేహితులతో కలవడని.. అతను తాగడు, పొగత్రాగడు, చెడు ప్రదేశాలకు వెళ్లడని తెలిపారు. అతను ఇంటి నుంచి పనికి వెళ్లి, పని నుంచి ఇంటికి వస్తాడని.. తర్వాత జిమ్ కి మాత్రమే వెళ్తాడని చెబుతూ... తన కొడుకు లాంటి కొడుకు కావాలని ఎవరైనా కోరుకుంటారని.. అతడు మంచి అబ్బాయని నవీద్ తల్లి వెల్లడించారు. దీంతో.. కొడుకు ఉగ్రవాది అయినా తల్లి మనసు తల్లి మనసే కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఆస్ట్రేలియా ప్రధాని కీలక నిర్ణయం!:
తాజా ఘటన అనంతరం ఆస్ట్రేలియాలోని తుపాకీ సంస్కృతిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి! ఈ నేపథ్యంలో ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కఠినమైన జాతీయ తుపాకీ చట్టాలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా.. లైసెన్స్ పొందిన యజమాని పొందగలిగే తుపాకుల సంఖ్యను పరిమితం చేయడంతో సహా కఠినమైన ఆంక్షలను ప్రతిపాదిస్తానని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
