Begin typing your search above and press return to search.

అమెరికా డెత్ వ్యాలీ రహస్యం: వాటంతట అవే కదిలే రాళ్లు.. ఆత్మ‌లు క‌దిలిస్తున్నాయా?

డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌(అమెరికా కాలిఫోర్నియా ప‌రిస‌రాలు)లోని రేస్‌ట్రాక్ ప్లాయాలో దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఊరిస్తున్న `సందేశం పంపే రాళ్ల` (సెయిలింగ్ స్టోన్స్) మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

By:  Sivaji Kontham   |   6 May 2026 5:00 AM IST
అమెరికా డెత్ వ్యాలీ రహస్యం: వాటంతట అవే కదిలే రాళ్లు.. ఆత్మ‌లు క‌దిలిస్తున్నాయా?
X

డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌(అమెరికా కాలిఫోర్నియా ప‌రిస‌రాలు)లోని రేస్‌ట్రాక్ ప్లాయాలో దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఊరిస్తున్న `సందేశం పంపే రాళ్ల` (సెయిలింగ్ స్టోన్స్) మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఎండిన సరస్సు గర్భంలో ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండానే రాళ్లు తమంతట తామే కదులుతూ సృష్టించే జాడల వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని సుమారు 70 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిశోధకులు ఛేదించారు. కొన్ని రాళ్లు 300 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉన్నా.. బురదతో కూడిన నేలపై పొడవైన ఆనవాళ్లను వదులుతూ ముందుకు సాగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ వింతను శాస్త్రీయంగా నిరూపించడానికి పరిశోధకులు అధునాతన సాంకేతికతను ఆశ్రయించారు. వారు ఒక ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు... 15 రాళ్లకు కదలికలను గుర్తించే జిపిఎస్ పరికరాలను అమర్చారు. ఈ ప్రయత్నం ప్రారంభించిన కేవలం రెండేళ్లలోనే శాస్త్రవేత్తలకు అద్భుతమైన ఆధారం దొరికింది. వాస్తవానికి ఈ కదలికలను గమనించడానికి ఐదు నుండి పదేళ్లు పడుతుందని భావించినా.. ప్రాజెక్ట్ ప్రారంభమైన కొద్ది కాలంలోనే రాళ్ల కదలికలను వారు ప్రత్యక్షంగా చూడగలిగారు.

ఈ రహస్యం వెనుక ఉన్న అసలు కారణం మంచు - గాలి అని పరిశోధనలో తేలింది. సరస్సు గర్భం నీటితో నిండిన అరుదైన సమయాల్లో రాత్రిపూట అక్కడి ఉష్ణోగ్రతలు తగ్గి నీరు 3 నుండి 5 మిల్లీమీటర్ల పలుచని మంచు పొరలుగా గడ్డకడుతుంది. సూర్యోదయం అయ్యాక ఈ మంచు పలకలు విడిపోయి, తేలికపాటి గాలుల వేగానికి వాటంత‌ట అవే క‌దులుతాయి. ఈ మంచు పలకలే వాటి కింద ఉన్న భారీ రాళ్లను మెల్లగా బురదపై ముందుకు నెడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సెకనుకు కేవలం 3 నుండి 5 మీటర్ల వేగంతో వీచే గాలులు కూడా ఈ ప్రక్రియకు సరిపోతాయని తేలింది.

రాళ్ల కదలిక అత్యంత నెమ్మదిగా సాగడం వల్లే ఇన్నాళ్లు ఇది రహస్యంగా మిగిలిపోయింది. ఈ రాళ్లు నిమిషానికి కేవలం 2 నుండి 6 మీటర్ల వేగంతో కదులుతాయి.. దీనిని మానవ కళ్లతో నేరుగా గమనించడం దాదాపు అసాధ్యం. వందలాది రాళ్లు ఒకేసారి కదలడం వల్ల నేలపై ఒకదానికొకటి సమాంతరంగా ఉండే జాడలు ఏర్పడుతున్నాయి. ఈ రాళ్లు పక్కపక్కనే ప్రయాణిస్తూ.. ఒకే రకమైన మలుపులు తిరగడం.. అకస్మాత్తుగా దిశను మార్చుకోవడం వంటి చిత్రమైన విన్యాసాలకు మంచు పలకల కదలికలే కారణం.

ఈ మొత్తం ప్రక్రియ అత్యంత సూక్ష్మంగా ఎవ‌రూ క‌నుగొన‌లేనంత నిశ్శబ్దంగా జరుగుతుంది. మనం ఆ ప్రదేశంలో ఉండి నేరుగా చూస్తున్నా.. అవి కదులుతున్నట్లు గుర్తించడం చాలా కష్టమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రకృతిలో దాగి ఉన్న ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను ఛేదించడానికి ఓపికతో పాటు సరైన సమయంలో సరైన సాంకేతికతను వాడటం ఎంత అవసరమో ఈ పరిశోధన నిరూపించింది. దశాబ్దాల పాటు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఈ రాళ్ల ప్రయాణం వెనుక ఉన్నది కేవలం ప్రకృతి శక్తుల సమతుల్యత మాత్రమేనని ఎట్టకేలకు స్పష్టమైంది. చాలా మంది ఇక్క‌డ ఆత్మ‌లు తిరుగుతున్నాయ‌ని అవి విచిత్ర విన్యాసాలకు పాల్ప‌డుతున్నాయ‌ని క‌థ‌లు పుట్టించినా చివ‌రికి ఇది ప్ర‌కృతి న‌డిపించే గ‌మ్మ‌త్త‌యిన విష‌యం అని శాస్త్రోక్తంగా తేలింది.