ఉన్నతాధికారి చెప్పినట్టే చేశాం: సాయికృష్ణ కేసు యూటర్న్
సాయికృష్ణది లాకప్ డెత్తేనని.. అయితే మృత దేహాన్ని ఏం చేశారన్న విషయంపై విచారణ జరుపుతున్నామని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన విషయం తెలిసిందే
By: Garuda Media | 29 Jun 2026 11:25 PM ISTవిజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. సాయికృష్ణది లాకప్ డెత్తేనని.. అయితే మృత దేహాన్ని ఏం చేశారన్న విషయంపై విచారణ జరుపుతున్నామని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఐ నాగరాజును అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు.
ఇక, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న కానిస్టేబుళ్లు జంగం నానీ, అశోక్‌లు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, సోమవారం మధ్యాహ్న సమయంలో వారు ముఖాలకు మాస్కులు ధరించి ఆటోలో వచ్చి విజయవాడ ఏసీపీ ముందు లొంగిపోయారు. దీంతో కీలక నిందితులు మొత్తం పోలీసుల అదుపులోనే ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్ల నుంచి కూడా ఏసీపీ వివరణ తీసుకున్నారు.
ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల మాట్లాడుతూ.. పై అధికారి చెప్పిందే తాము చేశామని చెప్పినట్టు తెలిసింది. తమ సొంతగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ ఉన్నతాధికారులు చెప్పినట్టు విధులు నిర్వహించా మని చెప్పారు. సాయికృష్ణ 23 కేసుల్లో నిందితుడని, కోర్టు వాయిదాలకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టు వెల్లడించారు. అతనిని పట్టుకునేందుకు తాము రాష్ట్ర వ్యాప్తంగా గాలించేందుకు పలు మార్లు వెళ్లాల్సి వచ్చిందని వివరించినట్టు సమాచారం.
తమకు ఎలాంటివ్యక్తిగత కక్షలు, కోపం లేదని, కేవలం ఉన్నతాధికారి చెప్పినట్టు విధులు నిర్వర్తించామని మాత్రమే ఇద్దరు పదే పదే చెప్పారని తెలిసింది. కానీ, ఈ కేసులో కీలకమైన సాయికృష్ణ శవం గురించి ఇద్ద రూ వెల్లడించకపోవడం గమనార్హం. థర్డ్ డిగ్రీ చేశారా? అన్నదానికి కూడా మౌనంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు.. వీరిని కోర్టుముందు హాజరు పరిచేందుకు గడువు ఉందని.. సమాచారం రాబడతామని అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో కీలకమైన నిందితులుగా పేర్కొంటున్న కానిస్టేబుళ్లు లొంగిపోయే వరకు పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా తెరమీదికి వచ్చింది.
