Begin typing your search above and press return to search.

ఇంత‌కీ ఆ సినిమా ఎక్క‌డ తేజూ?

తేజు స్థాయికి మించి, వంద కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో ఈ సినిమా చేయ‌డానికి రెడీ అయిన టీం.. ఆ బ‌డ్జెట్లో కూడా సినిమాను పూర్తి చేయ‌లేక‌పోతున్న‌ట్లుగా గ‌త ఏడాది వార్త‌లు వ‌చ్చాయి.

By:  Garuda Media   |   4 April 2026 9:39 AM IST
ఇంత‌కీ ఆ సినిమా ఎక్క‌డ తేజూ?
X

మెగా కుర్రాడు సాయి దుర్గా తేజ్ చివ‌రి సినిమా బ్రో రిలీజై మూడేళ్లు కావ‌స్తోంది. కానీ ఇంత వ‌ర‌కు త‌న కొత్త చిత్రం విడుద‌ల కాలేదు. రోడ్డు ప్ర‌మాదం తాలూకు కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల బ్రో త‌ర్వాత‌ కొన్ని నెల‌లు బ్రేక్ తీసుకోబోతున్న‌ట్లు తేజు చెప్పాడు కానీ.. ఆ విరామం త‌ర్వాత అత‌ను చేస్తున్న సినిమా సుదీర్ఘ కాలంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటూ ఎంత‌కీ విడుద‌ల కావ‌డం లేదు. గ‌త ఏడాది ద‌స‌రాకే రావాల్సిన సంబ‌రాల యేటి గ‌ట్టు.. ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. హ‌నుమాన్ సినిమాతో భారీ విజ‌యాన్నందుకున్న నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండ‌గా... కేపీ రోహిత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నాడు.

తేజు స్థాయికి మించి, వంద కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో ఈ సినిమా చేయ‌డానికి రెడీ అయిన టీం.. ఆ బ‌డ్జెట్లో కూడా సినిమాను పూర్తి చేయ‌లేక‌పోతున్న‌ట్లుగా గ‌త ఏడాది వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఈ సినిమా గురించి ఏ చ‌ర్చా లేదు. చూస్తుండ‌గానే నెల‌లు నెలలు గ‌డిచిపోతున్నాయి త‌ప్ప ఆ సినిమా విడుద‌ల గురించి సంకేతాలు రావ‌ట్లేదు.ఇంత‌లో ఇప్పుడు తేజు హీరోగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారుతో భారీ విజ‌యాన్నందుకున్న సాహు గార‌పాటి.. సుజీత్ సందీప్ అనే కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ చూస్తే ఇది కూడా భారీ చిత్రం లాగే క‌నిపిస్తోంది. కొత్త సినిమాను ప్ర‌క‌టించిన వేళ‌.. సామాజిక మాధ్య‌మాల్లో చాలామంది తేజు లాస్ట్ మూవీ సంగ‌తేంటి అని అడుగుతున్నారు. చూస్తుంటే ఈ వేస‌వికి కూడా సినిమా వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

అస‌లీ సినిమాకు ఎదుర‌వుతున్న స‌మ‌స్య ఏంటి అని మెగా ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు. బ‌డ్జెట్ హ‌ద్దులు దాటి సినిమాను పూర్తి చేయ‌లేని స్థితిలో ఉన్నారా.. లేక సినిమా పూర్త‌యినా ఓటీటీ డీల్, మిగ‌తా బిజినెస్ జ‌ర‌గ‌క సినిమాను బ‌య‌టికి తీసుకురాలేక‌పోతున్నారా అన్న‌ది తెలియ‌డం లేదు. ఇలా ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల ఉన్న క్రేజ్ త‌గ్గుతూ వెళ్ల‌డం ఖాయం. కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా సంబ‌రాల యేటిగ‌ట్టును బ‌య‌టికి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తే మంచిది.