Begin typing your search above and press return to search.

సోషల్ మీడియానే సాయం చేయాలి.. సాదిక్ ఖాన్ కోసం పోలీసుల వినూత్న ప్రచారం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   21 Aug 2026 7:04 PM IST
సోషల్ మీడియానే సాయం చేయాలి.. సాదిక్ ఖాన్ కోసం పోలీసుల వినూత్న ప్రచారం
X

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకుని పరారైన నిందితుడు తన ఆచూకీ చిక్కకుండా తిరుగుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 16న ఏఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోగా, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు నిందితుడి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేశారు. నిందితుడి ఫొటోలను షేర్ చేసిన పోలీసులు, నిందితుడి ఆచూకీ తెలుసుకునేలా విస్తృతంగా షేర్ చేయాలని కొంతమంది ఇన్ఫ్లూయెన్సర్లకు బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు.

రాష్ట్రం విడిచి పారిపోయాడా?

ఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా, నిందితుడు సాదిక్ ఖాన్ ఆచూకీ తెలియడం లేదు. ఆగస్టు 16వ తేదీ రాత్రి నూకరాజు కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గోదావరిలో దూకేముందు వారు తమ సూసైడ్ నోటును కొందరు సన్నిహితులకు వాట్సాప్ ద్వారా పంపారని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే నిందితుడు సాదిక్ ఖాన్ ఫోన్ వదిలేసి పరారైనట్లు చెబుతున్నారు. చివరగా ఆయన కర్ణాటకలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా, అక్కడి నుంచి తప్పించుకున్నాడని అంటున్నారు. దీంతో సాదిక్ ఖాన్ ఏమయ్యాడు? అతడికి ఎవరెవరు సహకరిస్తున్నారు? డబ్బు కోసం అతడు ఎవరిని సంప్రదిస్తున్నాడనే అంశాలపై నిఘా పెట్టినట్లు చెబుతున్నారు.

పాస్ పోర్టు స్వాధీనం

నిందితుడు సాదిక్ ఖాన్ దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. మరోవైపు సాదిక్ ఖాన్ దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు అష్టదిగ్బంధనం విధించినట్లు చెబుతున్నారు. ఇంటి నుంచి పారిపోయిన సమయంలో సాదిక్ ఖాన్ వద్ద రూ.15 వేలు మాత్రమే ఉన్నాయని, అవి ఖర్చయిన తర్వాత బయటకు రావడం ఖాయమని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

మత చాందసవాసమేనా? ఇంకేమైనా?

నిందితుడు సాదిక్ ఖాన్ మత చాందసవాదంతో ఏఈ నూకరాజు కుమార్తెను ఇస్లాం ఆచరించాల్సిందిగా ఒత్తిడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూకరాజు వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతోపాటు కాకినాడలోని మృతురాలు సౌజన్య ఇంట్లో లభ్యమైన లేఖల్లోనూ ఈ అంశం ఉందని అంటున్నారు. దీంతో సాదిక్ ఖాన్ ప్రవర్తనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి ప్రవర్తనను తట్టుకోలేక నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడంటే సాదిక్ ఖాన్ ఎంత పైశాచికత్వంతో ప్రవర్తించాడో అర్థమవుతోందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. మత చాందసవాదంతోపాటు మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.