ఆరోగ్యమే మహా భాగ్యం... సచిన్ చెప్పిన ఆరోగ్య రహస్యాలు!
అవును... నేటి యువత ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తున్నా.. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వారి జీవితాన్ని మూడు పదుల వయసు కంటే ముందే ముగించేస్తున్న పరిస్థితి.
By: Raja Ch | 27 Sept 2025 11:00 AM IST‘ఆరోగ్యమే మహా భాగ్యం’... అనేది అంతా చెప్పే మాట, పెద్దలు చెప్పిన మాట, ఇటీవల కాలంలో మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట! ప్రతీ మనిషికి ఉన్న అతి పెద్ద ఆస్తి ఆరోగ్యం మాత్రమేనని.. ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఆరోగ్యం సరిగా లేకపోతే అంతా సున్నా అనే పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఈ ఆధునిక యుగంలో సరైన ఆరోగ్యానికి అవసరమైన ఔషధాల గురించి.. నేటి యువతకు నిశబ్ధ విపత్తుగా మారిన సమస్య గురించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరంగా హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు.
అవును... నేటి యువత ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తున్నా.. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వారి జీవితాన్ని మూడు పదుల వయసు కంటే ముందే ముగించేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో అలాంటి ఘటనలు ఎన్నో వరుసగా జరిగిన పరిస్థితి. వాటికి సంబంధించిన వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ కీలక సూచనలు చేశారు.
ఇందులో భాగంగా... ఆటలాడడం, వ్యాయామం చేయడం, నడవడం అనేవి ఆధునిక ఔషధాలని చెప్పిన సచిన్... అధిక స్క్రీన్ సమయం నిశ్శబ్ద విపత్తుగా, యువ తరానికి అతిపెద్ద ముప్పుగా మారిందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత సెల్ ఫోన్, ట్యాబ్ అంటూ స్క్రీన్ కు బానిసలుగా తయారవుతున్నారని.. ఈ పరిణామం నిద్ర, ఏకాగ్రత సహా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు!
ఇదే సమయంలో... తక్కువ దూరానికి బైక్, కారు ఉపయోగించే బదులు, నడవటానికి ప్రాధాన్యమివ్వాలని.. నడకను వ్యసనంగా మార్చుకోవాలని చెప్పిన సచిన్... వ్యాయామం కోసం తప్పనిసరిగా రోజుకు కనీసం అరగంట కేటాయించాలని సూచించారు. అంతే ప్రధానంగా... అధిక స్క్రీన్ సమయాన్ని, అవసరం లేకపోయినా మొబైల్ ను చూడటాన్ని చాలా చాలా తగ్గించాలని నొక్కి చెప్పారు!
అదేవిధంగా.. తన ఫౌండేషన్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తున్న సచిన్... పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో రాణించాలన్న ఉత్సాహం చాలా కనిపిస్తుందని.. అయితే అక్కడ క్రీడా సౌకర్యాల అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఇదే సమయంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రజల భవిష్యత్తును పునర్నిర్మించడానికి శక్తిమంతమైన సంస్థలు చొరవ చూపాలని ఆయన కోరారు!
