Begin typing your search above and press return to search.

అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్! పంపలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త

శబరిగిరీశుడు భక్తులకు కీలక సూచనలు చేసింది కేరళ వైద్య ఆరోగ్య శాఖ. మండల దీక్షలో భాగంగా ఆదివారం నుంచి స్వామివారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.

By:  Tupaki Political Desk   |   18 Nov 2025 1:39 PM IST
అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్! పంపలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త
X

శబరిగిరీశుడు భక్తులకు కీలక సూచనలు చేసింది కేరళ వైద్య ఆరోగ్య శాఖ. మండల దీక్షలో భాగంగా ఆదివారం నుంచి స్వామివారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు వివిధ మార్గాల్లో శబరిమలకు చేరుకుంటున్నారు. అయితే కొద్దిరోజులుగా కేరళలో ఎక్కువగా వ్యాపిస్తున్న 'బ్రెయిన్ ఫీవర్' పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అడ్వయిజరీ జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రమాదకరమైన ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. దీనిని 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' ఫీవర్ అంటారు. మనకు అందరికీ తెలిసిన భాషలో మెదడు వాపు వ్యాధి అని పిలుస్తుంటారు. దీని బారిన పడకుండా ఉండాలంటే అయ్యప్ప భక్తులు ప్రత్యేకంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

శబరిమల సన్నిదానంలోని నదులు, చెరువులు, కాలువల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరింది. నీటిలో నైగ్లేరియా ఫౌలెరీ అనే అమీబా ఉండే అవకాశం ఉందని, ఇది ముక్కు ద్వారా మెదడుకు చేరి ప్రమాదకర స్థితిని తీసుకురావొచ్చని పేర్కొంది. భక్తులు స్నానం చేసేటప్పుడు నదులు, సెలయేర్ల నీరు ముక్కు ద్వారా లోనికి పోకుండా చూసుకోవాలని సూచనలు జారీ చేసింది. తలనొప్పి, జ్వరం, వాంతులు, మూర్ఛ వంటి సూచనలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుల సాయం తీసుకోవాలని అప్రమత్తం చేసింది. త్వరితగతిన డయాగ్నసిస్ లేకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉందని కేరళ వైద్యాధికారులు హెచ్చరించారు.

ఇక యాత్రికులకు సహాయార్థం ప్రత్యేక ఫోన్ నెంబరును కూడా కేరళ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. యాత్రికులకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే 04735 203232 నెంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది. అలసటగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోడానికి ప్రాధాన్యమివ్వాలని నడక మార్గంలో ముఖ్యంగా కొండపై నెమ్మదిగా నడిచి వెళ్లాలని పేర్కొంది. అదేవిధంగా వేడిచేసిన గోరువెచ్చని నీరు తాగాలని, ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.

పాత ఆహారం లేదా మూతలు లేని పదార్థాలను తొనవద్దని, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, చెత్తను చెత్త డబ్బాల్లో వేయడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కేరళలో నమోదు అవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని స్వామి సన్నిధానానికి వెళ్లే మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పంప నుంచి సన్నిధానం వరకు వెళ్లే మార్గంలో అంబులెన్సులు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక వైద్య శిబిరాల్లో సిబ్బందిని నియమించారు. పతనంతిట్టలో అత్యావసర కార్డియాలజీ సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడే అధునాత క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం భక్తులు అందరికీ తెలిసేలా యాత్రా మార్గంలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం.