Begin typing your search above and press return to search.

కేరళ ఆరోగ్య శాఖ నోట్.. శబరిమల యాత్రలో 2 చోట్ల గుండెపోటు ముప్పు?

ట్విస్టు చేసేందుకో.. వార్తను చదివించే కక్కుర్తితో ఈ హెడ్డింగ్ పెట్టలేదు. ఆ మాటకు వస్తే.. కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసిన అంశమన్న చేదు నిజాన్ని అస్సలు మిస్ కావొద్దు.

By:  Garuda Media   |   30 Nov 2025 9:45 AM IST
కేరళ ఆరోగ్య శాఖ నోట్.. శబరిమల యాత్రలో 2 చోట్ల గుండెపోటు ముప్పు?
X

ట్విస్టు చేసేందుకో.. వార్తను చదివించే కక్కుర్తితో ఈ హెడ్డింగ్ పెట్టలేదు. ఆ మాటకు వస్తే.. కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసిన అంశమన్న చేదు నిజాన్ని అస్సలు మిస్ కావొద్దు. అవును.. ఎంతో భక్తిశ్రద్దలతో దీక్ష చేపట్టి.. శబరిమలలో వేం చేసి ఉన్న అయ్యప్పస్వామిని సందర్శించేందుకు వెళ్లే భక్తులు.. కేర్ ఫుల్ గా ఉండాల్సిన అంశాలకు సంబంధించిన వివరాలివి. శబరిమల యాత్రికులకు రెండు చోట్ల గుండెపోటు ముప్పు పొంచి ఉంది,,

సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతంలో నడుస్తున్న వేళ.. డీహైడ్రేషన్.. ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే ప్రతికూల కారణాలతో గుండెపోటు ముప్పు ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ విషయాల్నికేరళ వైద్య ఆరోగ్య శాఖ సైతం స్పష్టం చేస్తోంది. పంపా బేస్ నుంచి శబరిమలకు వెళ్లే చిన్నపాదం మార్గం అత్యంత కఠినమైనదిగా పిలిచే నీలిమలతో పాటు కొండ శిఖరాగ్రంలో ఉండే అప్పాచిమేడు వద్ద భక్తులకు గుండెపోట్లు ఎక్కువగా వస్తున్న విషయాన్ని ఆరోగ్య శాఖ జారీ చేసిన అలెర్టులోనూ పేర్కొన్నారు.

ప్రతి ఏడాది నీలిమల.. అప్పాచిమేడు ప్రాంతాల్లో భక్తులు గుండెపోటుతో కుప్పకూలుతున్న ఉదంతాలు.. మరణాలు ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని ట్రావెన్ కోర్.. కేరళ వైద్య ఆరోగ్య శాఖ.. పోలీసు క్రైం డేటా రికార్డ్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2017-18 సీజన్ లో 281 మంది గుండెపోటుకు గురి కాగా.. వీరిలో 36 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడేళ్ల సీజన్ లో చోటు చేసుకున్న ఉదంతాలతో ఈ డేటాను సిద్ధం చేశారు.

ఎందుకిలా జరుగుతుందన్న విషయానికి వస్తే.. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటం.. ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో నీలిమల.. అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోట్లు ఎక్కువ. నీలిమల కొండ నిటారుగా.. చాలా ఎత్తుగా ఉంటుంది. శబరిమల యాత్రలో పెద్దపాదంలో ముక్కు కొండగా పిలిచే కరిమల కొండ తరవాత.. చిన్నపాదంలో దాదాపు అదే స్థాయిలోనే నీలిమల ఉంటుంది.

నీలిమలను ఎక్కే వారి కోసం ట్రావెన్ కోరు మెట్లు ఏర్పాటు చేసినా.. భక్తులు మత్రం ఈ ఒక్క కొండను ఎక్కేస్తే.. ఇబ్బందులు దూరమవుతాయన్న ఉద్దేశంతో నడకలో వేగాన్ని పెంచుతారు. మరికొందరు తమ టీంలోని వారు కొందరు ముందుకు వెళ్లిపోయారన్న ఉద్దేశంతో.. వారిని అందుకోవాలన్న తలంపుతో నడకలో వేగాన్ని పెంచుతారు. దీంతో హార్ట్ బీట్ లో మార్పులు చోటు చేసుకుంటాయి.

సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండటం.. ఆక్సిజన్ తగ్గటం.. ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండే వేళలో ప్రాణవాయువు సరిగా అందక బాడీలో ఆక్సిజన్ స్థాయిలో పడిపోతాయి. దీంతోగుండెకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. షుగర్.. బీపీ ఉన్న వారితో పాటు ఆరోగ్య సమస్యలు.. కొలెస్ట్రాల్.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు నీలిమల.. అప్పాచివేడు ప్రాంతంలో నడిచే వేళలో నడక వేగాన్ని అస్సలు పెంచొద్దని సూచన చేస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికి మరణాలు ప్రతి ఏటా పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. దీక్ష తీసుకున్న స్వాములు రేయిబవళ్లు ప్రయణాలు చేయటం.. సమయానికి భోజనం తీసుకోకపోవటం చేస్తారు. కేవలం శాఖాహార హోటళ్లలో మాత్రమే భోజనం చేయాల్సి రావటంతో.. కంటి నిండా నిద్ర.. కడుపు నిండా తిండి ఉండక శరీరం అలసిపోతుందని చెబుతారు. ఇలాంటప్పుడే డీహైడ్రేషన్ పెరిగి.. గ్లూకోజ్ స్థాయిలు.. ఎలక్ట్రోలైట్లు తగ్గి గుండె మీద ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు ఈ సందర్భంగా గుండెపోట్లు వస్తాయని చెబుతున్నారు.

దీంతో పాటు మరో కారణాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. భక్తులు పలువురు పంపా బేస్ కు చేరుకున్నంతనే అక్కడి హోటళ్లలో భోజనం చేస్తారు. ఆ వెంటనే కొండ ఎక్కే పని మొదలు పెడతారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు భోజనం తర్వాత రక్తప్రసరనణ ఎక్కువగా జీర్ణాశయం వైపు వెళుతుందని.. అప్పుడు రెట్టింపు ఒత్తిడి ఉంటుందని.. కడుపు నిండా భోజనం ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే రిస్కు ఎక్కువని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ రెండు ప్రాంతాల్లో నడిచే భక్తులు.. అక్కడ నిదానంగా కొండ ఎక్కటం మంచిదని సూచన చేస్తున్నారు.

కొవిడ్ కాలంలో భక్తుల్ని పరిమిత సంఖ్యలోనే అనుమతించిన కారణంగా గుండెపోట్లు తక్కువగా నమోదయ్యాయి. 2018-19లో 24 మంది మరణిస్తే.. 2019-20లో 19 మంది.. 2022-23లో 24, 2023-24లో 24.. 2024-25లొ 40 మంది భక్తులు గుండెపోటుతో మరణించినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సో. స్వాములు బీకేర్ ఫుల్.