Begin typing your search above and press return to search.

శబరిమల బంగారం చోరీ కేసులో ట్విస్ట్ : ఆ నటుడిని విచారించిన సిట్

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారం చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వేళ ఈ కేసులో మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాక్షిగా విచారించడం కొత్త మలుపు తీసుకొచ్చింది.

By:  A.N.Kumar   |   30 Jan 2026 4:21 PM IST
శబరిమల బంగారం చోరీ కేసులో ట్విస్ట్ : ఆ నటుడిని విచారించిన సిట్
X

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారం చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వేళ ఈ కేసులో మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాక్షిగా విచారించడం కొత్త మలుపు తీసుకొచ్చింది. ఆలయ ఆభరణాల మాయం కేసు విచారణలో భాగంగా ఆయన పాత్ర, పరిచయాలు, పూజా కార్యక్రమాలపై అధికారులు విస్తృతంగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

చెన్నై నివాసంలో సుదీర్ఘ విచారణ

శుక్రవారం చెన్నైలోని జయరామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను గంటల కొద్దీ ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి తో ఉన్న సంబంధాలపై విచారణ కేంద్రీకృతమైంది. ఇద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం వ్యక్తిగతమా, ఆధ్యాత్మికమా? ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయా? వంటి అంశాలపై అధికారులు స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. జయరామ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారికంగా రికార్డు చేసినట్లు సమాచారం.

పూజలు, ఫొటోలు వైరల్

గతంలో జయరామ్ ఇంట్లో ఆలయ ఆభరణాలతో పూజలు నిర్వహించినట్లు వెలుగులోకి వచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. అయితే ఆ పూజలు ఆలయంలో బంగారం పూత మాయం అయిన తర్వాతే జరిగాయని సిట్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ జయరామ్–పొట్టి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

శబరిమల ఆలయంలో బంగారం మాయం ఆరోపణలు

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిల్ గర్భగృహం తలుపుల ఫ్రేమ్‌లపై ఉన్న బంగారం పూత మాయం అయ్యిందన్న ఆరోపణలతో ఈ కేసు మొదలైంది. ఆలయ ఆస్తుల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.

అరెస్టులు, బెయిల్లు

ఇప్పటివరకు ఈ కేసులో సిట్ మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు మురారి బాబు, శ్రీకుమార్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిర్ణీత 90 రోజుల వ్యవధిలో చార్జ్‌షీట్ దాఖలు కాకపోవడంతో వారికి ఉపశమనం లభించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి కూడా ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, ఇతర కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఇంకా జైలులోనే కొనసాగుతున్నాడు.

సినీ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చ

మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు కలిగిన జయరామ్ పేరు ఈ కేసులో వినిపించడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తరచూ శబరిమల యాత్రకు వెళ్లే భక్తుడిగా ఆయనకు ఉన్న పేరు కారణంగా ఈ విచారణ మరింత ఆసక్తికరంగా మారింది.

దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయాలకు రావద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ, ఆలయ బంగారం కేసు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆందోళనను కలిగిస్తోంది. సిట్ తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.