Begin typing your search above and press return to search.

ఆమె చేసిన ఘోరమైన తప్పు.. మనస్ఫూర్తిగా ప్రేమించింది

చదువుకోవటానికి భారత్ కు వచ్చి.. ఒక భారతీయుడ్ని ప్రాణంగా ప్రేమించింది. అతడే జీవితమని భావించింది.

By:  Garuda Media   |   19 Feb 2026 9:11 AM IST
ఆమె చేసిన ఘోరమైన తప్పు.. మనస్ఫూర్తిగా ప్రేమించింది
X

చదువుకోవటానికి భారత్ కు వచ్చి.. ఒక భారతీయుడ్ని ప్రాణంగా ప్రేమించింది. అతడే జీవితమని భావించింది. అదెంత తప్పన్నది ఇప్పుడామెకు అర్థం కావటమే కాదు.. పెళ్లి చేసుకున్న పాపానికి నరకం అనుభవిస్తున్న ఆమె ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అనకుండా ఉండలేం. అంతేనా.. ఇంతటి నమ్మకద్రోహాన్ని ఎక్కడా చూడలేదంటున్న ఆమె.. తన జీవితంలో మరోసారి భారతీయుడ్ని నమ్మనని తెగేసి చెబుతోంది. అంతేకాదు.. తన దేశానికి తాను తిరిగి వెళ్లేందుకు వీల్లేని రీతిలో ఉన్న వీసా లోపాల్ని ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ గా మారటమే కాదు.. పలువురు భారతీయులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కేంద్రప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్నది బాధితురాలి మాటల్లో చదివితే..

నా పేరు ఒల్గా. నాది రష్యా. 2015లో జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో పీహెచ్ డీ కోసం భారత్ కు వచ్చా. ఒక భారతీయుడ్ని ప్రేమించా. (అతడి పేరును వెల్లడించలేదు కానీ ఇన్ స్టాలో అతడి ఫోటోను బ్లర్ చేసి పెట్టింది) ఇద్దరం 2019లో పెళ్లి చేసుకున్నాం. ఈ దేశంలో శాశ్వితంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నా. అయితే.. కొద్ది రోజుల తర్వాత మా మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో స్పౌసల్ వీసా కోసం అప్లై చేశా. ఇదెందుకు అంటే.. భారతీయ పౌరుడు లేదంటే ఓసీఐ కార్డు హోల్డర్ ను పెళ్లి చేసుకున్న విదేశీయులకు మంజూరు చేసే వీసా ఇది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ జరిగితే.. నా భర్త రాలేదు. దీంతో మా మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో నేను రష్యాకు వెళ్లేందుకు రెఢీ అయ్యా.

కట్ చేస్తే.. 2024 జనవరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా భర్త కనిపించకుండా పోయాడు. దీంతో టెన్షన్ తో పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆర్నెల్లు దాటినా అతడి ఆచూకీ లభించలేదు. అతను ఇక లేడన్న భయంతో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా. ఓవైపు కుటుంబం లేదు మరోవైపు డబ్బుల్లేవు. దీనికి తోడు వీసా సమస్యలతో రష్యాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి.

ఓ రోజు జపాన్ టూరిస్టు ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో కనిపించకుండా పోయిన నా భర్త అందులో కనిపించాడు.. అదీ సన్యాసిలా మారిపోయి. వెంటనే.. అతడ్ని కలిసే ప్రయత్నం చేశా. చివరకు అతడ్ని కలిస్తే.. సారీ చెప్పి.. ప్రేమిస్తున్నా అని నమ్మించాడు. మళ్లీ ఇంకెప్పుడూ చేయనని మాట ఇవ్వటంతో మళ్లీ నమ్మేశా. భర్తకు సాయంగా ఉండేందుకు హిమాచల్ ప్రదేశ్ లో జాబ్ చేస్తూ.. భర్తకు ఆర్థికంగా సాయం చేస్తున్నా.

ఈ క్రమంలోనే నా భర్తకు మరో మహిళతో సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నా. దీంతో రష్యాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించా. కానీ.. నేను కనిపించకుండా పోయానన్న మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన కారణంగా విమానం నుంచి దింపేశారు. ప్రస్తుతం వీసా సమస్యల్ని పరిష్కరించేందుకు కిందామీదా పడుతోంది. నేను చేసిన తప్పు ఏమైనా ఉందంటే.. మనస్ఫూర్తిగా.. ప్రాణంగా ప్రేమించటమే అన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి. ఈ పోస్టుకు బారతీయులు పెద్ద ఎత్తున స్పందిస్తూ.. ఆమెకు అండగా నిలవటమే కాదు.. అతడిపై చర్యలు తీసుకోవాలన్న మాట పలువురి నోటి నుంచి రావటం గమనార్హం.