పుతిన్ తో ప్రెస్ మీట్.. గాళ్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేశాడు
ఒక దేశాధినేత నిర్వహించే ప్రెస్ మీట్ లో క్లిష్టమైన ప్రశ్నలు సంధించే జర్నలిస్టుల కారణంగా ఎన్నో పరిణామాలకు కారణమవుతూ ఉంటుంది.
By: Garuda Media | 20 Dec 2025 11:12 AM ISTఒక దేశాధినేత నిర్వహించే ప్రెస్ మీట్ లో క్లిష్టమైన ప్రశ్నలు సంధించే జర్నలిస్టుల కారణంగా ఎన్నో పరిణామాలకు కారణమవుతూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా రష్యాలో చోటు చేసుకున్న ఒక సీన్ అరుదుగా చోటు చేసుకునేదిగా చెప్పాలి. సినిమాటిక్ గా ఉన్న ఈ సీన్ లోకి వెళితే.. రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతున్నారు.
ఇలాంటి వేళ కిరిల్ బజానోవ్ అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు అనూహ్య రీతిలో తన గాళ్ ఫ్రెండ్ కు మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అంటూ పుతిన్ ఎదుట తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. ‘ఓల్గా నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా’ అంటూ అన్న అతడి మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు.
అనంతరం అతను పుతిన్ తో మాట్లాడుతూ.. రష్యాలో జీవన వ్యయం పెరిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తాను..తన గాళ్ ఫ్రెండ్ ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని.. పెద్ద ఎత్తున ఉన్న ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే జర్నలిస్టు కిరిల్ బజానోవ్ పెళ్లి ప్రపోజనల్ ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లుగా ప్రకటించారు.
దీంతో వేదిక మీద ఉన్న పుతిన్ తో సహా అక్కడున్న వారంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా తమ పెళ్లికి అధ్యక్షుడు పుతిన్ రావాలని కోరగా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే.. యువ జర్నలిస్టుకు ఆర్థిక సాయాన్ని మాత్రం ప్రకటించటం గమనార్హం. అతడు ప్రసావించిన ఆర్తిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ‘మనం విరాళాలతో అతడి పెళ్లికి కావాల్సిన డబ్బును సేకరించాలి’ అని పేర్కొన్నట్లుగా వెల్లడించారు. ఏమైనా దేశాధ్యక్షుడి ప్రెస్ మీట్ వేళ.. మ్యారేజ్ ప్రపోజల్ తో ప్రపంచం కంట్లో పడ్డాడీ జర్నలిస్టు.
