బరువు పెరగాలి, తగ్గాలి.. ఛాలెంజ్ లో ఫిట్ నెస్ కోచ్ మృతి!
అవును... 30 ఏళ్ల రష్యన్ ఫిట్ నెస్ ట్రైనర్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా... మొదట బరువు బాగా పెరిగి, తర్వాత తగ్గాలి.
By: Raja Ch | 27 Nov 2025 10:00 PM ISTఅతి స్పర్థయా వర్ధతే... అని అంటారు.. ఇప్పుడు ఆ ప్రస్థావన ఎందుకనేది ఇది చదివిన తర్వాత తెలుస్తుంది! రష్యన్ ఫిట్ నెస్ కోచ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన డిమిత్రి నుయాంజిన్.. తన కొత్త బరువు తగ్గించే కార్యక్రమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో అధిక కేలరీలు, అతిగా తినడం అనే సవాలును చేపట్టారు. ఈ సవాలును చేపట్టిన తర్వాత అతడు గుండెపోటుతో నిద్రలోనే మరణించారని అంతర్జాతీయ మీడియా నివేదించింది.
అవును... 30 ఏళ్ల రష్యన్ ఫిట్ నెస్ ట్రైనర్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా... మొదట బరువు బాగా పెరిగి, తర్వాత తగ్గాలి. ఈ సమయంలో ఈ కొత్త ప్రోగ్రామ్ ను ప్రోత్సహించే క్రమంలో అతడు రోజుకు సుమారు 10,000 కేలరీల వరకూ తినేవాడట. ఇందులో ప్రధానంగా.. కొలెస్ట్రాల్ నిండిన, ఫాస్ట్ ఫుడ్ ను తీసుకునేవారని నివేదించబడింది. ఈ సవాల్ లో అతని లక్ష్యం కనీసం 25 కిలోలు పెరగడం అని చెబుతున్నారు.
ఆ తర్వాత అతను తన కొత్త ఫిట్ నెస్ సూచనలు, న్యూట్రిషన్ కోర్సును ఉపయోగించి బరువును ఎంత త్వరగా తగ్గించుకోవచ్చో ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఈ సవాలులో భాగంగా డిమిత్రి ఒక నెల వ్యవధిలో సుమారు 13 కిలోల కంటే ఎక్కువ బరువు పెరిగాడు. నవంబర్ 18న తన ఇన్ స్టా పోస్టులో తన తాజా బరువు 103 కిలోలని వెల్లడించాడు.
ఈ సందర్భంగా... ఈ ఛాలెంజ్ లో భాగంగా అతని రోజువారీ ఆహారం విపరీతంగా ఉండేదని.. ఇందులో భాగంగా... అందులో పేస్ట్రీలు, మయోన్నైస్ తో కప్పబడిన డంప్లింగ్స్, బర్గర్, పిజ్జాలు, కేక్ వంటివి ఉన్నాయి. ఇటీవల అతడు మీడియాతో మాట్లాడుతూ.. తన బ్రేక్ ఫాస్ట్ లో ప్లేట్ పేస్ట్రీలు, సగం కేకు ఉంటాయని.. భోజన కోసం రెగ్యులర్ మన్నెస్ తో 800 గ్రాముల డంప్లింగ్స్ తింటానని తెలిపారు.
ఇదే సమయంలో రాత్రి భోజనం కోసం ఒక కేఫ్ లేదా డెలివరీలో బర్గర్, రెండు చిన్న పిజ్జాలు తీసుకుంటానని అన్నారు. ఈ క్రమంలోనే అతను మరణించాడు. అతని మరణ వార్త ఫిట్ నెస్ కమ్యూనిటీని, సోషల్ మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేగంగా, అనారోగ్యకరమైన బరువు పెరగడం లేదా తగ్గడం శరీరంపై కలిగించే హృదయనాళ ఒత్తిడి తీవ్రమని అంటున్నారు!
