Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం : ఇరవై లక్షల శవాల దిబ్బపై శాంతి సాధ్యమేనా?

అంతర్జాతీయ వేదికలపై శాంతి మంత్రాలు ఉచ్ఛరించడం, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో యుద్ధాన్ని ఆపడానికి జరుగుతున్న ప్రయత్నాలు శూన్యం.

By:  A.N.Kumar   |   3 July 2026 10:26 AM IST
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం :  ఇరవై లక్షల శవాల దిబ్బపై శాంతి సాధ్యమేనా?
X

రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో తుపాకుల మోత ప్రారంభమై.. క్షిపణులు నిప్పులు కురిపించడం మొదలై మూడేళ్లు దాటిపోయింది. ఆధునిక మానవ నాగరికత, అంతర్జాతీయ సమాజం ముక్కున వేలేసుకునేలా సాగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో... గెలుపోటముల లెక్కల కంటే శవాల లెక్కలే భయంగొల్పుతున్నాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ప్రపంచ విలువలపై చెంపదెబ్బలా తగిలాయి. ఇరు దేశాల వైపు కలిపి సైనిక మరణాలు.. గాయాల సంఖ్య క్యాజువాలిటీస్ ఏకంగా 20 లక్షలకు చేరిందన్న వార్త 21వ శతాబ్దపు అతిపెద్ద మానవ నిర్మిత వినాశనానికి అద్దం పడుతోంది. సాంకేతికతతో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్నామని మురిసిపోతున్న మానవాళి... ఒకరినొకరు చంపుకోవడంలోనూ అదే సాంకేతికతను వాడుతూ ఎంతటి క్రూరత్వానికి ఒడిగడుతుందో చెప్పడానికి ఈ సంఖ్యే సజీవ సాక్ష్యం.

ఈ యుద్ధంలో రష్యా తీవ్రమైన నష్టాన్ని మూటగట్టుకుందన్నది బహిరంగ రహస్యం. సూపర్‌ పవర్‌గా, తిరుగులేని సైనిక శక్తిగా విర్రవీగిన క్రెమ్లిన్ సామ్రాజ్యం... ఈ మూడేళ్లలో ఏకంగా 14 లక్షల మంది సైనికులను కోల్పోవడమో లేదా యుద్ధానికి పనికిరాకుండా చేసుకోవడమో చేసింది. ఇందులో 4.5 లక్షల మంది యోధులు ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక తరాన్ని సమాధి చేయడమే. మరోవైపు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ చెల్లించిన మూల్యం కూడా తక్కువేమీ కాదు. లక్షన్నర మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా.. ఆరు లక్షలకు పైగా సైనికులు అంగవైకల్యంతో మిగిలిపోయారు. ఈ రణరంగాలలో డ్రోన్లు, హైపర్‌సోనిక్ క్షిపణుల తాకిడికి కూలిపోతున్నది కేవలం భవనాలు మాత్రమే కాదు... ఇరు దేశాల భవిష్యత్తు కూడా...

అయితే ఈ విధ్వంసం కేవలం ఆ రెండు దేశాల సరిహద్దులకే పరిమితం కాలేదు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వేళ.. ఈ యుద్ధం సృష్టించిన ఆర్థిక భూకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సామాన్యుడిని తాకింది. ముడి చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ రవాణా భారంగా మారింది. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని పేద దేశాలకు గోధుమలు, ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయి లక్షలాది మంది ఆకలి కోరల్లో చిక్కుకున్నారు. ఐరోపా దేశాలు శరణార్థుల భారంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక పక్క మానవతా సంక్షోభం, మరోపక్క ద్రవ్యోల్బణంతో ప్రపంచం కొట్టుమిట్టాడుతున్నా... ఆయుధ వ్యాపారుల గల్లా పెట్టెలు నిండుతుండటం ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు నగ్న సత్యం.

అంతర్జాతీయ వేదికలపై శాంతి మంత్రాలు ఉచ్ఛరించడం, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో యుద్ధాన్ని ఆపడానికి జరుగుతున్న ప్రయత్నాలు శూన్యం. భూభాగాలను వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్.. పట్టు వదిలితే తన అహం దెబ్బతింటుందని రష్యా మొండిగా ముందుకు సాగుతున్నాయి. పాశ్చాత్య దేశాలు శాంతిని స్థాపించడం కంటే, ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తూ యుద్ధాన్ని మరింత కాలం పొడిగించడానికే ఆసక్తి చూపిస్తున్నాయి. చివరకు మిగిలేది శ్మశాన వైరాగ్యమే అని 20 లక్షల మంది సైనికుల బలిదానాలు హెచ్చరిస్తున్నా, ప్రపంచ నేతల్లో ఇంకా విజ్ఞత మేల్కొనకపోవడం విచారకరం.

ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం కేవలం ఆంక్షల రాజకీయాలు పక్కనబెట్టి.. ఇరు పక్షాలను చర్చల మేజా బల్ల ముందుకు తెచ్చేందుకు నిజాయితీతో కూడిన గట్టి ప్రయత్నం చేయాలి. లేదంటే ఈ యుద్ధ జ్వాలలు మరికొన్ని దేశాలను దహించివేయడమే కాకుండా.. భవిష్యత్తు తరాలకు కోలుకోలేని చీకటిని మిగులుస్తాయి.