ఉక్రెయిన్ పై రష్యా ఉప్పెన.. యూరప్ మొత్తానికి పుతిన్ అల్టిమేటం
ఒకపక్క కొలిక్కివచ్చినట్లే వచ్చిన ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతలోనే ముదురుతోంది. అటునుంచి ఇటు, ఇటునుంచి అటు డ్రోన్ దాడులు, క్షిపణుల ప్రయోగాలు సాధారణంగా మారాయి.
By: Tupaki Political Desk | 9 Jan 2026 5:30 PM ISTఒకపక్క కొలిక్కివచ్చినట్లే వచ్చిన ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతలోనే ముదురుతోంది. అటునుంచి ఇటు, ఇటునుంచి అటు డ్రోన్ దాడులు, క్షిపణుల ప్రయోగాలు సాధారణంగా మారాయి. ఇటీవల ఉక్రెయిన్ ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం పైకి 90 పైగా డ్రోన్లను పంపింది. అప్పుడే రష్యా ప్రతీకారం తీర్చుకుంటుందని భావించారు. కానీ, కాస్త ఆలస్యమైనా తన పవర్ ఏమిటో చూపించింది మాస్కో. పుతిన్ తో పెట్టుకుంటే ఎట్టా ఉంటుందో చాటిచెప్పింది. ఈ దాడి యావత్ యూరప్ నకూ హెచ్చరిక అనడంలో సందేహం లేదు. అంతగా రష్యా ప్రయోగించిన క్షిపణి ప్రత్యేకతలు ఏమిటో చూస్తే మతిపోవాల్సిందే. ఉక్రెయిన్ కు చిల్లులు పడేలా రష్యా వదిలిన క్షిపణి 14 నెలల కిందటే ప్రయోగాత్మకంగా పరీక్షించినది కావడం గమనార్హం.
ఒరెష్నిక్.. ఒళ్లు జలదరించాల్సిందే..
వచ్చే నెల 24తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు నిండుతాయి. అప్పటికైనా ఈ రెండు దేశాల మధ్య సంధి కుదురుతుందని ఆశల్లేవ్. ఎందుకంటే. తాజాగా గురువారం అర్థరాత్రి రష్యా తన అత్యాధునిక క్షిపణి ఒరెష్నిక్ ను ఉక్రెయిన్ వెస్ట్ లోని లీవ్ ప్రాంతంపైకి ప్రయోగించింది. ఈ నగరం యుద్ధం మొదట్లో రష్యాకు టార్గెట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఒరెష్నిక్ తో విరుచుకుపడింది. ఈ క్షిపణి సాధారణమైనది కాదు.. ధ్వని (సౌండ్) కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఇది పుతిన్ నివాసంపై దాడికి ప్రతీకారం అని రష్యా స్పష్టం చేయడం గమనార్హం. కాగా, శత్రువు దాడి నలుగురి చనిపోగా, 22 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ నిర్ధారించింది.
యావత్ యూరప్ పరిధిలోకి..
ఒరెష్నిక్ అడ్వాన్డ్స్ క్షిపణి. రష్యన్ లో దీని అర్థం హేజల్ నట్ చెట్టు అని. తమ క్షిపణులకు రష్యా ఇలా చెట్ల పేర్లే పెడుతుందట. ధ్వని గంటకు 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒరెష్నిక్ దీనికి పదిరెట్లు 13 వేల కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు. యావత్ యూరప్ ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. అయితే, ఒరెష్నిక్ మధ్య శ్రేణి క్షిపణే. కానీ, దీన్ని అడ్డుకునే శక్తి దేనికీ లేదు. 2024 నవంబరులో ఒరెష్నిక్ ప్రయోగ పరీక్ష చేపట్టారు. అప్పట్లో ఉక్రెయిన్ ఫ్యాక్టరీ మీద ప్రయోగించారు. ఈ 14 నెలల్లో మరింత డెవలప్ చేశారు. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన, రష్యా మిత్రదేశమైన బెలారస్ కు దీనిని తరలించారు.
అణువీర భయంకర... నాటోకు ఝలక్
ఒరెష్నిక్.. అణుబాంబులతో పాటు వార్ హెడ్ లనూ మోసుకెళ్తుంది. దీని ద్వారా రష్యా.. ఉక్రెయిన్ పై ఎక్కడ దాడి చేసినదీ తెలియకున్నా, భూగర్భ సహజ వాయువు నిల్వలపై ప్రయోగించినట్లు మాత్రం తెలుస్తోంది. అయితే, ఇది నాటో సరిహద్దులో పడినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు.
