పుతిన్ కు వ్యతిరేకంగా పోటీచేసే దమ్ము రష్యాలో ఎవరికీ లేదా?
మూడు రోజుల పాటు కొనసాగే ఈ పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 18న ప్రారంభమై సెప్టెంబర్ 20వ తేదీ వరకు సాగనుంది. రష్యా పార్లమెంట్‌లోని దిగువ సభ అయిన 'స్టేట్ డూమా' లోని మొత్తం 450 స్థానాలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
By: A.N.Kumar | 19 Sept 2026 11:36 PM ISTఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభమైన తర్వాత రష్యాలో జరుగుతున్న తొలి పార్లమెంటరీ ఎన్నికలు అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 18న ప్రారంభమై సెప్టెంబర్ 20వ తేదీ వరకు సాగనుంది. రష్యా పార్లమెంట్‌లోని దిగువ సభ అయిన 'స్టేట్ డూమా' లోని మొత్తం 450 స్థానాలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
విధానపరమైన ఓటింగ్ సరళి
ఈ ఎన్నికల్లో ప్రతినిధుల ఎంపికకు రెండు రకాల పద్ధతులను అమల్లోకి తెచ్చారు. మొత్తం 450 స్థానాల్లో సగం (225 స్థానాలు) పార్టీ జాబితాల ప్రాతిపదికన, మిగిలిన సగం స్థానాలను నేరుగా సింగిల్-మెంబర్ నియోజకవర్గాల ద్వారా ఎన్నుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ ఆన్‌లైన్ ఓటింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఎలక్ట్రానిక్ విధానంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోటీలో లేని ప్రతిపక్షం.. ఏకపక్ష వాతావరణం
ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన 'యునైటెడ్ రష్యా' పార్టీ ప్రధాన శక్తిగా బరిలో నిలిచింది. అయితే పుతిన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉక్రెయిన్ యుద్ధ విధానాలను బహిరంగంగా నిరసించే ఏ ఒక్క జాతీయ పార్టీకి కూడా బ్యాలెట్ పేపర్‌పై చోటు దక్కకపోవడం గమనార్హం. రష్యాలో ఏకైక బహిరంగ యుద్ధ వ్యతిరేక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన 'యాబ్లోకో' ను అధికారిక పార్టీల జాబితా నుంచి తొలగించారు.
ఎన్నికల బరిలో కమ్యూనిస్ట్ పార్టీ, ఎల్‌డీపీఆర్ , 'ఎ జస్ట్ రష్యా', 'న్యూ పీపుల్' వంటి ఇతర పార్టీలు ఉన్నప్పటికీ.. అవన్నీ పుతిన్ పాలనకు లేదా ఉక్రెయిన్ సైనిక చర్యకు మద్దతు ఇచ్చే వైఖరినే కలిగి ఉన్నాయి. దీంతో రష్యా రాజకీయ క్షేత్రంలో సైనిక చర్యను వ్యతిరేకించే ప్రత్యామ్నాయ స్వరం లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆక్రమిత ప్రాంతాల్లో ఓటింగ్.. అంతర్జాతీయ వ్యతిరేకత
2014లో రష్యా విలీనం చేసుకున్న క్రిమియాతో పాటు 2022 యుద్ధంలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సాన్, జపొరిజ్జియా ప్రాంతాల్లో కూడా రష్యా ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. అయితే ఈ భూభాగాల్లో ఎన్నికల నిర్వహణను ఉక్రెయిన్ ప్రభుత్వం చట్టవిరుద్ధమని తీవ్రంగా ఖండించగా.. అంతర్జాతీయ సమాజం కూడా రష్యా చర్యను గుర్తించేందుకు నిరాకరించింది.
ఫలితాల ప్రాధాన్యత
యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ జరుగుతున్న ఈ ఎన్నికలను, తన పాలన.. యుద్ధ విధానాలకు రష్యా ప్రజల నుంచి లభించిన మద్దతుగా పుతిన్ ప్రభుత్వం చిత్రీకరిస్తోంది. మరొకవైపు ప్రతిపక్ష అభ్యర్థులపై ఆంక్షలు.. ఉక్రెయిన్ భూభాగాల్లో పోలింగ్ వంటి అంశాలు ఈ ఎన్నికల పారదర్శకతపై అంతర్జాతీయంగా అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ 20న పోలింగ్ పూర్తయిన వెంటనే వెలువడనున్న ఈ ఫలితాలు.. రష్యా రాజకీయ వ్యవస్థలో పుతిన్ పట్టును మరోసారి స్పష్టం చేయనున్నాయి.
