Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... పాక్ కు రష్యా సహకారంలో నిజం ఎంత?

పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా మద్దతుగా నిలుస్తుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   5 Oct 2025 1:43 PM IST
హాట్ టాపిక్... పాక్ కు రష్యా సహకారంలో నిజం ఎంత?
X

పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా మద్దతుగా నిలుస్తుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పాక్ అధికారిక బ్యాచ్ మొత్తం నిత్యం అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెరవేరుస్తూ.. ట్రంప్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే... భారత్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్న రష్యా సైతం పాకిస్థాన్ కు సహకరిస్తుందనే కథనాలు ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారాయి.

అవును... భారత్ కు రష్యా అత్యంత సన్నిహిత వ్యాపార భాగస్వామిగా చెబుతారనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే ప్రధాన కారణంగా చూపించి.. భారత్ పై అమెరికా పెద్ద ఎత్తున సుంకాలు విధించింది. రష్యాతో భారత్ వ్యాపారం ఉక్రెయిన్ తో యుద్ధానికి పరోక్ష మద్దతు అనే కామెంట్లూ చేసింది. ఈ సమయంలో పాకిస్థాన్ యుద్ధ విమానాలకు రష్యా ఇంజిన్లు సరఫరా చేస్తుందనే వార్తలు ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... పాకిస్థాన్‌ యుద్ధ విమానాల కోసం ఇంజిన్లను రష్యా సరఫరా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలను మాస్కో కొట్టిపారేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ తో తమకు అటువంటి ఒప్పందం ఏమీ జరగలేదని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో... భారత్‌ తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఈ తరహా ప్రచారాలు చేయడం సరికాదన్నాయి.

అదేవిధంగా... భారతదేశానికి ఇబ్బందికరంగా మారే ఎలాంటి చర్యలు తాము చేపట్టబోమని రష్యా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయని అంటున్నారు. మరో వైపు ఈ విషయం భారత్ లో మోడీ సర్కార్ పై విపక్షాల విమర్శలకు కారణమైంది.

ఈ విషయంపై తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఇందులో భాగంగా... రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపర భాగస్వామిగా ఓ వైపు ప్రధాని మోడీ చెబుతారని.. కానీ, ఆ దేశం మాత్రం మన శత్రు దేశమైన పాకిస్థాన్ కు మద్దతునిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఇది ప్రధాని మోడీ వైఫల్యాన్ని సూచిస్తుందని అన్నారు.

ఇదే సమయంలో... ప్రధాని మోడీ జాతీయ ప్రయోజనాలకంటే తనకు పేరు వచ్చే విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని జైరాం రమేష్ దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో... అసలు పాకిస్థాన్ కు రష్యా ఎందుకు సహకారం అందిస్తుందో మోడీ ప్రభుత్వం వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నట్లు చెప్పే మోడీ.. దౌత్యం విషయంలో పాకిస్థాన్ ను ఇప్పటికీ ఒంటరిని చేయలేకపోతున్నారని విమర్శించారు.

కాగా... పాకిస్థాన్ లో ఉన్న చైనా తయారీ జేఎఫ్-17 ఫైటర్ జెట్లలో వాడే ఆర్.డీ.-93ఎంఏ ఇంజిన్లను రష్యా సరఫరా చేస్తోందంటూ పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అటు అంతర్జాతీయగానూ, ఇటు భారత్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు!