రష్యా నుంచి ముడి చమురు కొనటంతో భారత్ కు ఎంత లాభం?
రష్యా ఉత్పత్తి చేసే ముడి చమురును భారత్ మాత్రమే కొంటున్నట్లుగా అగ్రరాజ్యం పదే పదే చెబుతోంది.
By: Garuda Media | 25 Aug 2025 12:00 PM ISTరష్యా ఉత్పత్తి చేసే ముడి చమురును భారత్ మాత్రమే కొంటున్నట్లుగా అగ్రరాజ్యం పదే పదే చెబుతోంది. గణాంకాల్ని చూస్తే.. అదెంత అబద్ధమో ఇట్టే అర్థమవుతుంది. రష్యా ఉత్పత్తి చేసే ముడి చమురులో దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. రష్యా నుంచి దిగుమతి చేసే దేశాల్లో చైనా వాటా అక్షరాల 47 శాతం కాగా భారత్ 38 శాతం. ఈ రెండు దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కు చెందిన దేశాల వాటా 6 శాతం ఉంది. టర్కీ 6 శాతంతో పాటు మరికొన్ని దేశాలుచేసుకునే దిగుమతులు మూడు శాతం ఉంటాయి.
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నాటి నుంచి అంటే.. 2022 నుంచి 2025 జులై వరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన లెక్కల్ని రూపాయిల్లో చూస్తే.. ఈ విషయం మరింత బాగా అర్థమవుతుంది. భారత్ రూ.13.39 లక్షల కోట్ల ముడిచమురును దిగుమతి చేసుకుంటే.. చైనా రూ.17 లక్షల కోట్ల వరకు దిగుమతి చేసుకుంది. మరి.. భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్.. చైనా మీద మరింత ఎక్కువగా మోగించాల్సి ఉంటుంది కదా? ఈ సూటి ప్రశ్నను ట్రంప్ నకు సంధించే బాధ్యతను ఎవరో ఒకరు తీసుకోవాల్సిందే.
అదిలించి.. బెదిరించి తమ దారికి తీసుకురావాలన్నట్లుగా భారత్ విషయంలో ట్రంప్ అండ్ కో ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ.. నిజంగానే రష్యాను ఆర్థికంగా బలహీనం చేయాలన్నదే లక్ష్యమైతే.. ముడిచమురు ధరలు తగ్గేలా కీలకమైన ఓపెక్ దేశాలను అమెరికా ఎందుకు ప్రభావితం చేయదు? రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ముగింపునకు భారత్ మాత్రమే బాధ్యత తీసుకోవాలా? మిగిలిన ప్రపంచ దేశాలు ఎందుకు ఆ భారాన్ని మోయకూడదు?
ప్రపంచ దేశాలన్ని తలో చేయి వేసి.. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరించే పని చేసినప్పుడు.. భారత్ మాత్రం అందుకు దూరంగా ఉంటే తప్పు పట్టటంలో అర్థం లేదు. ఏ దేశం తన ఆర్థిక ప్రయోజనాల్ని వదులుకోవటానికి ఆసక్తి చూపని వేళ.. భారత్ మాత్రం ఆ భారాన్ని మోయాలని ట్రంప్ లాంటోళ్లు అనుకోవటంలో అర్థముందా? అందరూ తలో చేయి వేసి.. భారాన్ని సమంగా పంచుకున్న వేళ.. భారత్ అందుకు భిన్నంగా తన ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అప్పుడు తప్పు పట్టినా దానికో అర్థముంది.
ముడిచమురు ఎగుమతుల్లో ఓపెన్ దేశాల వాటా ఎంతన్నది తెలిసిందే. వారు వసూలు చేసే ధరల గురించి తెలిసిందే. ఓపెన్ దేశాలు అమ్ముతున్న ముడిచమురు బ్యారెల్ ధరకు రష్యా మనకు ఇస్తున్న బ్యారెల్ ధరకు మధ్య వ్యత్యాసం ఎంతో తెలిస్తే కాస్తంత ఆశ్చర్యపోవాల్సిందే. ఒక అంచనా ప్రకారం ఓపెన్ దేశాల ధరతో పోలిస్తే.. మనకు రష్యా ఇస్తున్న బ్యారెల్ ధరలో వచ్చే తేడా భారీగా ఉంటుందని చెబుతున్నారు. మరింత వివరంగా అర్థం కావాలంటే ఒక బ్యారెల్ మీద తక్కువలో తక్కువ రూ.500 కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ధరతో పాటు.. విదేశీ మారకద్రవ్యం వల్ల కలిగే ఆదాల్ని పరిగణలోకి తీసుకుంటే అది మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్ దేశాల వద్ద ముడిచమురు కొంటే.. మారకంగా అమెరికా డాలర్ ను వినియోగించాల్సి ఉంటుంది. అదే.. రష్యా దగ్గర కొనుగోలు చేస్తే.. మన రూపాయిల్ని వారికి ఇవ్వొచ్చు. దీని ద్వారా విలువైన మారకద్రవ్యాన్ని ఆదా చేసే వీలుంది. రష్యా నుంచి భారత్ కు రోజువారీగా సగటున వచ్చే ముడి చమురు బ్యారెల్స్ దగ్గర దగ్గర 15లక్షలు. నిజానికి జూన్ లో ఈ దిగుమతి మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
ధరలో తేడా.. విదేశీ మారకద్రవ్యంతో కలిగే ఆదాతో పాటు.. ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ద్వారా ఒక నెలకు భారత్ కు జరిగే ఆర్థిక లాభం రూ.900 కోట్లకంటే ఎక్కువ ఉంటుంది. అంటే.. ఏడాదికి రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువ ఆదా అవుతుంది. ఆదా అంటే ఖర్చు తగ్గటమే కదా? అంతేకాదు.. రష్యా ఇచ్చే డిస్కౌంట్లలో ఒక శాతం అదనంగా ఇస్తే దగ్గర దగ్గర రూ.300 కోట్లకు పైనే ఆదాయం వస్తుంది.
అదే డిస్కౌంట్ బ్యారెల్ కు 2.25 డాలర్ల చొప్పున రూ.913 కోట్లు నెలకు ఆదా అయితే.. అదే డిస్కౌంట్ బ్యారెల్ కు 5 డాలర్ల చొప్పున అయితే నెలకు కలిగే లాభమే రూ.2030 కోట్లు. ఇంతటి భారీ లాభాన్ని భారత్ ఎందుకు వదులుకోవాలి? అన్నది అసలు ప్రశ్న. ధరలో కలిగే లాభంతో పాటు.. డాలర్ మీద భారత్ ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఇది మరో సానుకూలాంశం. ఇలాంటప్పుడు ట్రంప్ మోగించే సుంకాల మోతకు బెదిరిపోకుండా.. ప్రత్యామ్నాయాల్ని పరిశీలించటం.. ఆ దిశగా భారత్ అడుగులు వేయాల్సిన అవసరముంది. అంతేకాదు.. ఆ సమయం ఆసన్నమైందన్నది మర్చిపోకూడదు.
