రష్యా స్ట్రాటజిక్ ఆఫర్.. భారత్ కోసం ఆయిల్ భారీ డిస్కౌంట్.. ట్రంప్ కు షాక్
భారత్‌లో ప్రస్తుతం రష్యా చమురు మార్కెట్ వాటా 37 శాతంగా ఉంది. అయితే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా రష్యా నుంచి కొనుగోళ్లను తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
By: A.N.Kumar | 8 Aug 2025 6:53 PM ISTవాషింగ్టన్-మాస్కో రాజకీయాల మధ్య భారత్ మరోసారి లాభదాయక స్థానాన్ని దక్కించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యా భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో చమురు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ తాజా పరిణామం ట్రంప్‌కు మరో పరోక్ష షాక్‌గా భావిస్తున్నారు. చమురు మార్కెట్‌లో కీలకంగా మారిన ఉరల్స్ గ్రేడ్ క్రూడ్ ధర, డేటెడ్ బ్రెంట్ చమురుతో పోలిస్తే ప్రస్తుతానికి బ్యారెల్‌కు సుమారుగా ఐదు డాలర్లు తక్కువగా ఉంది. ఇది ఇటీవలే రెండువారాల క్రితం వరకూ సమానంగా ఉన్నదని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కేపీఎల్‌ఈఆర్ లిమిటెడ్ పేర్కొంది.
- భవిష్యత్తులో చమురు ధరలు మరింతగా పడిపోవచ్చని అంచనా
కేపీఎల్‌ఈఆర్ అంచనా ప్రకారం.. వచ్చే కొన్ని నెలల్లో ఉరల్స్ చమురు ధరలు మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య రష్యా చమురు శుద్ధి ప్లాంట్లలో నిర్వహణ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రష్యా భారీగా చమురు నిల్వలను తక్కువ ధరలకు దిగుమతి చేసే అవకాశం ఉందని అర్థమవుతోంది.
- ప్రభుత్వ సంస్థల జాగ్రత్త చర్యలు కీలకం
భారత్‌లో ప్రస్తుతం రష్యా చమురు మార్కెట్ వాటా 37 శాతంగా ఉంది. అయితే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా రష్యా నుంచి కొనుగోళ్లను తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు పూర్తిగా వెనక్కి తగ్గితే, రష్యా మార్కెట్ వాటాలో భారీ తగ్గుదలే సంభవించనుంది. ప్రైవేట్ రంగ కంపెనీలు మాత్రం కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి.
-రాజకీయంగా స్ట్రాటజిక్ మూవ్‌గా రష్యా ఆఫర్
ట్రంప్ భారతదేశంపై అదనపు టారిఫ్‌లు విధించడాన్ని విమర్శిస్తూ, రష్యా ఎంచుకున్న ఈ డిస్కౌంట్ వ్యూహం గ్లోబల్ ఎనర్జీ పాలిటిక్స్‌లో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశం ఇప్పటికే రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతులు చేసుకుంటూ అంతర్జాతీయ మార్కెట్‌పై తన ప్రభావాన్ని పెంచుకుంటోంది.
ఈ క్రమంలో రష్యా-భారత్ మధ్య చమురు సంబంధాలు మరింత బలపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరొకవైపు అమెరికా తన ద్వంద్వ విధానాలను కొనసాగిస్తే, భారత్ మరింతగా రష్యా వైపు తలూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొత్తం మీద అమెరికా ఒత్తిడులు పెంచుతున్న తరుణంలో రష్యా ఇచ్చిన చమురు ఆఫర్ భారత్‌కు ఆర్థికంగా లాభదాయకమే కాక, జియోపాలిటికల్ పరంగా మద్దతుగా మారుతోంది.
