Begin typing your search above and press return to search.

జెలెన్ స్కీతో ట్రంప్ భేటి వేళ రష్యా క్షిపణుల వర్షం

ఈ దాడుల ధాటికి కీవ్ కు సమీపంలోని బ్రావరీ నగరంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నగరం అంధకారంలో మునిగిపోయింది.

By:  A.N.Kumar   |   27 Dec 2025 6:31 PM IST
జెలెన్ స్కీతో ట్రంప్ భేటి వేళ రష్యా క్షిపణుల వర్షం
X

రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కసి కోపాన్ని ఉక్రెయిన్ పై వదలడం లేదు. కొరకరాని కొయ్యగా మారి యూరప్, అమెరికా మద్దతుతో చెలరేగిపోతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడిని అదును చూసి దెబ్బకొడుతూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్న వేళ రష్యా తన సైనిక ప్రతాపాన్ని మరోసారి ప్రదర్శించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్ స్కీ మధ్య జరుగబోయే కీలక భేటికి కొన్ని గంటల ముందు రష్యా భీకర క్షిపణి దాడులకు తెగబడడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

డిసెంబర్ 27 రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను లక్ష్యంగా చేసుకొని రష్యా భారీ క్షిపణి డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో రష్యా తన అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించింది. ధ్వని కంటే వేగంగా ప్రయాణించే వీటిని అడ్డుకోవడం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు సవాలుగా మారింది. నాలుగు ఇస్కందర్ క్షిపణులతోపాటు అనేక కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఆకాశం నుంచి డ్రోన్స్ వరుసగా విరుచుకుపడడంతో కీవ్ పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి..

ఈ దాడుల ధాటికి కీవ్ కు సమీపంలోని బ్రావరీ నగరంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నగరం అంధకారంలో మునిగిపోయింది. కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో ప్రజలను అప్రమత్తం చేస్తూ వెంటనే బంకర్లలోకి వెళ్లాలని హెచ్చరించారు.

ట్రంప్ జెలెన్ స్కీ భేటి వేళ ‘శాంతి ప్రతిపాదన’..

మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు ఫ్లోరిడా వేదికగా డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటి కానున్నారు. ఈ భేటిపై జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ఇప్పటికే 20 అంశాలతో కూడిన శఆంతి ప్రణాళికను సిద్ధం చేశామని.. అది 90 శాతం పూర్తయ్యిందని వెల్లడించారు.అయితే ట్రంప్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘నా ఆమోదం లేకుండా ఏ ఒప్పందమూ జరగదు. జెలెన్ స్కీ ఏం చెబుతాడో విందాం’ అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా మధ్యవర్తిత్వం లేకుండా ఈ యుద్ధం ముగియదని ట్రంప్ పరోక్షంగా స్పష్టం చేశాడు.

ప్రతిదాడి మాత్రమేనన్న రష్యా

శాంతి చర్చల ముంగిట రష్యా జరిపిన ఈ భారీ దాడులు పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి. తమది ప్రతిదాడి మాత్రమేనని రష్యా చెబుతోంది. కానీ చర్చల సమయంలో తమ పట్టు బిగించేందుకు రష్యా ఈ ప్రదర్శన చేసిందా? అన్న అనుమానాలున్నాయి. ట్రంప్ జోక్యంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక ఉక్రెయిన్ మరిన్ని ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుందా? శాంతి దిశగా అడుగులు పడుతున్న సమయంలో క్షిపణుల మోత మోగడం.. చర్చల ప్రక్రియ ఎంత కఠినంగా ఉండబోతోందో సూచిస్తోంది.