సముద్రగర్భంలో భారీ భూకంపం, సునామీ.. భారతీయులకు హెచ్చరికలు!
అవును... రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో సముద్రగర్భ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా 4 మీటర్లు ఎత్తుకు సునామీ అలలు ఎగసిపడ్డాయి.
By: Raja Ch | 30 July 2025 9:19 AM ISTరష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే రష్యాలోని కామ్చాట్ స్కీ ద్వీపకల్పంతో పాటు జపాన్ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే రెండు దేశాలనూ సునామీ తాకింది. సముద్ర తీరాల్లో రాక్షస అలలు ఎగసిపడుతున్నాయి.
అవును... రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో సముద్రగర్భ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా 4 మీటర్లు ఎత్తుకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంతో పాటు జపాన్ తూర్పు తీరంలోనూ చాలా వరకు ప్రజలను ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో.. అమెరికా సహా పసిఫిక్ అంతటా హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
ఈ సందర్భంగా... ఈ భూకంపం 19.3 కిలోమీటర్ల లోతులో సంభవించిందని, దీని కేంద్రం అవాచా బే వెంబడి దాదాపు 1,65,000 జనాభా కలిగిన తీరప్రాంత నగరం కామ్చాట్ స్కీకి తూర్పు - ఆగ్నేయంగా సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మొదట్లో ఈ భూకంప తీవ్రత 8.0గా నివేదించగా.. అనంతరం 8.8కి అప్ గ్రేడ్ చేసింది.
అయితే... ఇప్పటివరకు ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదని.. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్, కామ్చాట్ స్కీ నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. ఆ ప్రాంతాల్లో విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు వెల్లడించింది.
భారతీయులకు బిగ్ అలర్ట్!:
రష్యాలో భూకంపం సంభవించడంతో జపాన్ తో పాటు ఉత్తర పసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా... సునామీ ముప్పును శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపింది.
ఈ సమయంలో... కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్ లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలని.. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వాలని.. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని తెలిపింది.
స్పందించిన ట్రంప్!:
తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా.. పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా... అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో... ప్రజలంతా ధైర్యంగా ఉండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు.
