Begin typing your search above and press return to search.

అమెరికాకు షాకిచ్చిన పుతిన్‌.. మొదలైన అణు టెన్షన్‌..!

ఉక్రెయిన్‌ యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న కీలక సమయంలో ప్రపంచంలో మరోసారి అణు టెన్షన్‌ మొదలైంది.

By:  A.N.Kumar   |   28 Oct 2025 6:00 PM IST
అమెరికాకు షాకిచ్చిన పుతిన్‌.. మొదలైన అణు టెన్షన్‌..!
X

ఉక్రెయిన్‌ యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న కీలక సమయంలో ప్రపంచంలో మరోసారి అణు టెన్షన్‌ మొదలైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా అమెరికాతో ఉన్న కీలకమైన ప్లుటోనియం ఒప్పందంను పూర్తిగా రద్దు చేస్తూ చట్టంపై సంతకం చేశారు. రష్యా వెనక్కి తగ్గేది లేదని స్పష్టమైన సంకేతం ఇస్తున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

న్యూక్లియర్ డీల్ రద్దు: నేపథ్యం ఏమిటి?

అమెరికా-రష్యా దేశాలు 2000 సంవత్సరంలో 'ప్లుటోనియం మేనేజ్‌మెంట్‌ అండ్‌ డిస్‌పొజిషన్‌ అగ్రిమెంట్‌' (PMDA) పేరుతో ఒక చారిత్రక ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం రెండు దేశాలు తమ వద్ద ఉన్న సుమారు 34 మెట్రిక్‌ టన్నుల ప్లుటోనియంను అణ్వాయుధాల తయారీకి ఉపయోగించకుండా నిరోధించడం... ఆ ప్లుటోనియంను పౌర అణు విద్యుత్‌ ఉత్పత్తి కోసం మాత్రమే ఉపయోగించుకోవడం.. ఈ ఒప్పందం ద్వారా అప్పట్లో సుమారు 17 వేల అణ్వాయుధాల తయారిని నివారించగలిగామని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే, 2016 నుండే అమెరికా–రష్యా సంబంధాలు క్షీణించడం మొదలైంది. ఆ సమయంలోనే బరాక్‌ ఒబామా పాలనలో ఈ ఒప్పందం అమలుపై పుతిన్‌ అనుమానాలు వ్యక్తం చేసి నిలిపివేశారు. ఇప్పుడు, ఉక్రెయిన్‌ యుద్ధం, నాటో దేశాల మద్దతు నేపథ్యంలో రష్యా ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అణ్వాయుధాల తయారీ వేగవంతమా?

ప్లుటోనియం ఒప్పందం రద్దుతో రష్యా మళ్లీ అణ్వాయుధాల తయారీని వేగవంతం చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య ప్రపంచ అణు సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ట్రంప్‌ హెచ్చరిక: “మాతో ఆటలాడొద్దు”

రష్యా చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే 'బురెవెస్ట్‌నిక్‌’ క్రూజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంపై ట్రంప్ స్పందించారు. "ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా అణు జలాంతర్గాములు రష్యా తీరానికి దగ్గరగా ఉన్నాయి. మాతో ఆటలాడొద్దు. మేము యుద్ధం కోరుకోవడం లేదు, కానీ రష్యా చర్యలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి" అని ట్రంప్‌ హెచ్చరించారు. ఆయన పుతిన్‌కు యుద్ధం ముగించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, క్షిపణి పరీక్షలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

'బురెవెస్ట్‌నిక్‌’ క్షిపణి శక్తి

రష్యా పరీక్షించిన 'బురెవెస్ట్‌నిక్‌’ క్రూజ్‌ క్షిపణి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. రష్యా సైన్యం ప్రకారం.. ఇది 15 గంటల పాటు గాల్లో ప్రయాణించగలదు. 14,000 కిలోమీటర్ల దూరం చేరే సామర్థ్యం ఉంది. అత్యంత కచ్చితత్వంతో ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలదు. ఈ క్షిపణుల మోహరింపుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని పుతిన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

పుతిన్‌ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా అణు అపనమ్మకాన్ని పెంచుతోంది. ఒకవైపు ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అణు ఒప్పందాల రద్దు, అత్యాధునిక క్షిపణి పరీక్షలు ప్రపంచానికి ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికాతో సంబంధాలు చల్లబడిన నేపథ్యంలో రష్యా తన సైనిక శక్తిని ప్రపంచానికి ప్రదర్శించడం ద్వారా అగ్రరాజ్యాల మధ్య అణు సమతుల్యత మరింత అస్థిరంగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.