బిగ్ అలర్ట్... 30 చోట్ల ప్రకంపనలు, 16 చోట్ల సునామీ!
అవును... రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించగా.. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది.
By: Raja Ch | 30 July 2025 12:36 PM ISTరష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ సందర్భంగా పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే గంటల్లో రష్యా, జపాన్ తీరాల వెంబడి విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది!
అవును... రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించగా.. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. ఈ సమయంలో లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 9లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ క్రమంలో జపాన్ లో సుమారు 16 చోట్ల సునామీ నమోదైందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో దాదాపు 4 మీ ఎత్తులో సముద్ర అలలు కనిపించాయని.. ముఖ్యంగా ఇషినోమాకి ఓడరేవు వద్ద యాభై సెం.మీ. ఎత్తులో సముద్ర అలలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఇదే సమయంలో కాలిఫోర్నియా, హవాయి తీరప్రాంతాల్లోనూ సునామీ హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు రష్యాలోని కమ్చట్కాలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన కాసేపటి తర్వాత సుమారు 30 సార్లు ప్రకంపనలు సంభవించాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే... అనేక మధ్య, దక్షిణ అమెరికా దేశాలు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలాలు:
రష్యాలో సంభవించిన భూకంపం కారణంగా జపాన్ ను సునామీ తాకిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ ను తాకిన వేళ.. సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్లు పడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
చైనా ఎల్లో అలర్ట్ జారీ!:
రష్యాలోని కమ్చట్కాలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత చైనా ఎల్లో సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇందులో భాగంగా... తూర్పు తీరం వెంబడి బలమైన అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెబుతూ.. షాంఘై, జౌసాన్ లో ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు.
