Begin typing your search above and press return to search.

భారీ భూకంపం, సునామీ తర్వాత రష్యాలో పేలిన అగ్నిపర్వతం!

ఈ సమయంలో... అత్యంత చురుకైన క్లూచెస్వ్స్కోయ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.

By:  Raja Ch   |   31 July 2025 10:53 AM IST
భారీ భూకంపం, సునామీ తర్వాత రష్యాలో పేలిన అగ్నిపర్వతం!
X

రష్యాను బుధవారం భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేల్‌ పై 8.8 తీవ్రత నమోదైన ఈ భూకంపంవల్ల రష్యాతోపాటు జపాన్, అమెరికా, హవాయ్‌ దీవుల్లో సునామీ వచ్చింది. ఆ సమయంలో సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. అటు భూకంపం, ఇటు సునామీతో రష్యా వణికిపోగా.. ఆ తర్వాత యురేషియాలో అత్యంత చురుకైన, ఎత్తైన క్లూచెస్వ్స్కోయ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది

ఆవును... రష్యాలోని మారుమూల కమ్చట్కా ద్వీపకల్పాన్ని 8.8 తీవ్రతతో భూకంపం కుదిపేయడం.. ఆ సమయంలో రష్యాతో పాటు ప్రధానంగా జపాన్, అమెరికాల్లో సునామీ రావడం.. కొన్ని లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం జరిగింది. ఈ సమయంలో... అత్యంత చురుకైన క్లూచెస్వ్స్కోయ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో... పసిఫిక్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇలా అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం నుండి లావా ప్రవహించడం ప్రారంభమైందని రష్యన్ రాష్ట్ర వార్తా సంస్థ నివేదించింది. కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న క్లూచెస్వ్స్కోయ్ 4,750 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న అగ్నిపర్వతం నుంచి నారింజ రంగులో మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో... రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క యునైటెడ్ జియోఫిజికల్ సర్వీస్ ఈ విస్ఫోటనాన్ని ధృవీకరించింది.

ఈ సందర్భంగా స్పందించిన రష్యన్ యూనియన్ ఆఫ్ ట్రావెల్ ఇండస్ట్రీ... అగ్నిపర్వత విస్ఫోటనం, లావా ప్రవహించడం, బిలం మీద శక్తివంతమైన మెరుపు, పేలుళ్లు గమనించవచ్చని తెలిపింది. అయినప్పటికీ.. అగ్నిపర్వతాల పాదాలను సందర్శించే పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకొవడం కానీ, వాయిదా వేసుకోవడం కానీ చేసుకోలేదని తెలిపింది.

ఇదే సమయంలో పర్యాటకుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని వెల్లడించింది. సరికదా... చాలా మంది ప్రయాణికులు అక్కడే ఉండి ఆ దృశ్యాన్ని చూడాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారని తెలిపింది.

కాగా... ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 2023లో విస్ఫోటనం చెందింది. ఇదే సమయంలో.. ఈ కమ్చట్కాలో సుమారు 300 అగ్నిపర్వతాలు తరచుగా విస్ఫోటనం చెందుతాయని అంటున్నారు. వీటిలో 29 అగ్నిపర్వతాలు మాత్రం అత్యంత చురుకుగా ఉన్నాయని చెబుతున్నారు.