Begin typing your search above and press return to search.

పాక్ ప్రభుత్వమే కాదు మీడియా కూడా అంతేనా?.. రష్యా ఎంబసీ ఫైర్!

ఈ క్రమంలో తాజాగా ఆ దేశానికి చెందిన దినపత్రికపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇందులో భాగంగా... పాక్ కు చెందిన ఇంగ్లిష్ డైలీ ది ఫ్రాంటియర్ పోస్ట్ పై పాక్ లోని రష్యా రాయబార కార్యాలయం నిప్పులు చెరిగింది.

By:  Raja Ch   |   7 Nov 2025 3:27 PM IST
పాక్ ప్రభుత్వమే కాదు మీడియా కూడా అంతేనా?.. రష్యా ఎంబసీ ఫైర్!
X

ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్ ప్రభుత్వ పాలనపైనా, అది అనుసరిస్తున్న వైఖరిపైనా పలు దేశాల నుంచి తీవ్ర విమర్శలు వస్తుంటాయనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా ఆ దేశానికి చెందిన దినపత్రికపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇందులో భాగంగా... పాక్ కు చెందిన ఇంగ్లిష్ డైలీ ది ఫ్రాంటియర్ పోస్ట్ పై పాక్ లోని రష్యా రాయబార కార్యాలయం నిప్పులు చెరిగింది.

అవును... పాకిస్థాన్ కు చెందిన ది ఫ్రాంటియర్ పోస్ట్ దినపత్రికపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా మాస్కోకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ.. బలమైన పదజాలాలతో కూడిన ప్రకటన వెలువడింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని రష్యా రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టింది. ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇందులో భాగంగా... పాకిస్తానీ ఆంగ్ల వార్తాపత్రిక ది ఫ్రాంటియర్ పోస్ట్‌ లో ప్రచురితమైన రష్యన్ వ్యతిరేక కథనాల శ్రేణిని తాము గమనించామని మొదలుపెట్టిన రష్యా రాయబార కార్యాలయం.. మొదటగా ఈ పత్రికను 'పాకిస్తానీ' అని పిలవలేమని తాము నొక్కి చెప్పాలనుకుంటున్నామని.. ఎందుకంటే దాని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ లో ఉందని పేర్కొంది.

ఇదే సమయంలో... ఆ పత్రిక ఎడిటోరియల్ బోర్డు రష్యా విదేశాంగ విధానాన్ని విమర్శించే కంటెంట్‌ ను నిరంతరం ఎంచుకుంటోందని.. సమతుల్య నివేదికలకు చోటు లేకుండా చేసిందని.. ఇటీవల ఆ వార్తాపత్రిక అంతర్జాతీయ విభాగంలో రష్యా నాయకత్వాన్ని సానుకూలంగా లేదా తటస్థంగా చిత్రీకరించే ఒక్క కథనాన్ని కూడా కనుగొనడం అసాధ్యమని ఎంబసీ పేర్కొంది.

ఆఖరికి 2025 అక్టోబర్ 7న జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌ పై మాస్కో ఫార్మాట్ ఆఫ్ కన్సల్టేషన్స్‌ ను నివేదించడంలోనూ ఈ పత్రిక విఫలమైందని ఎత్తి చూపుతూ.. దాని కవరేజ్ ఎంపికలను కూడా రాయబార కార్యాలయం విమర్శించింది. పాకిస్తాన్ మీడియాలో విస్తృతంగా కవర్ చేయబడిన ఈ ఈవెంట్‌ ను ఫ్రాంటియర్ పోస్ట్ పూర్తిగా విస్మరించింది అని వెల్లడించింది.

ఆర్థిక పతనం అంచున రష్యా అంటూ...!:

ఇదే సమయంలో... రష్యాను ఆర్థికంగా బలహీనమైనది, ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉంది అంటూ ఆ వార్తాపత్రిక చిత్రీకరించడాన్ని ఖండిస్తూ.. అటువంటి వాదనలు నిరాధారమైనవని రాయబార కార్యాలయం పేర్కొంది. ఏ దేశ చరిత్రలోనూ ఇంతకు ముందు లేని విధంగా అపారమైన బాహ్య ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, రష్యన్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పురోగతిని ప్రదర్శించిందని తెలిపింది.

ఈ సందర్భంగా.. 2024లో రష్యా జీడీపీ 4.1 శాతం పెరిగిందని.. తయారీ వంటి కొన్ని రంగాలు 8.5 శాతం వరకు పెరుగుదల నమోదైందని పాకిస్థాన్ లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించిది. ఈ వాస్తవాలు మరిచి సదరు దినపత్రిక కావాలనే బుద్రద జల్లుతుందని.. రష్యాకు వ్యతిరేకంగా విదేశీ స్పాన్సర్లకు సేవ చేస్తోందన్నట్లు మండిపడింది.