రష్యాలో 'బ్లాక్ విడో' స్కామ్.. యుద్ధ పరిహారం కోసం పెళ్లిళ్లు.. అసలు ఏం జరుగుతోంది?
సరిహద్దుల్లో శత్రువుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచే వీరులను సొంత సమాజంలోనే కొందరు నరరూప రాక్షసులు ఏ విధంగా వాడుకుంటున్నారో తెలిపే దారుణమైన నిజమే రష్యాలో కలకలం రేపుతున్న 'బ్లాక్ విడో' స్కామ్.
By: A.N.Kumar | 6 Aug 2026 10:34 AM ISTదేశం కోసం.. మాతృభూమి రక్షణ కోసం కంటిపాపలా చూసుకునే పసిపిల్లలను.. కట్టుకున్న భార్యను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలి రణరంగానికి వెళ్తున్న సైనికుల నిస్వార్థ త్యాగాలు ఒకవైపు చూస్తుంటే.. ఆ సైనికుల శవాల పైచిల్లర ఏరుకునే రాబందుల్లాంటి క్రూర మనస్తత్వాలు మరొకవైపు బయటపడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ నడుమ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ భయంకర యుద్ధం తెచ్చిపెట్టిన మానవీయ విషాదం చాలదన్నట్లు ఇప్పుడు రష్యా సమాజాన్ని ఒక ఘోరమైన నైతిక పతనం కుదిపేస్తోంది. సరిహద్దుల్లో శత్రువుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచే వీరులను సొంత సమాజంలోనే కొందరు నరరూప రాక్షసులు ఏ విధంగా వాడుకుంటున్నారో తెలిపే దారుణమైన నిజమే రష్యాలో కలకలం రేపుతున్న 'బ్లాక్ విడో' స్కామ్.
రణరంగంలో అమరులైన రష్యన్ సైనికుల త్యాగానికి గుర్తుగా వారి కుటుంబాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో రష్యా ప్రభుత్వం సుమారు ₹60 లక్షల వరకు భారీ పరిహారాన్ని నష్టపరిహారంగా అందిస్తోంది. అయితే సరిగ్గా ఈ ఆపన్న హస్తమే కొందరు నైతికత లేని మహిళలకు, స్వార్థపూరిత ముఠాలకు అడ్డదారిలో కోట్లు సంపాదించే అవకాశంగా మారిపోయింది. రణరంగానికి బయలుదేరి మరణపుటంచుల వరకు వెళ్లే అవకాశం ఉందనుకున్న అమాయక యువకులను లేదా తీవ్ర గాయాలతో ఆస్పత్రి బెడ్లపై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సైనికులను వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రేమ, సానుభూతి పేరిట మాయమాటలు చెప్పి వారిని త్వరితగతిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ తదుపరి క్షణంలో లేదా కొద్ది రోజుల్లోనే ఆ సైనికుడు ప్రాణాలు కోల్పోగానే చట్టబద్ధమైన భార్య హోదాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ఆ రక్తపు పరిహారాన్ని తమ ఖాతాల్లో వేసుకుని హాయిగా జలసా చేస్తున్నారు.
ఈ దారుణమైన కుట్రలు అంతటితో ఆగడం లేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒక మిలిటరీ ఆస్పత్రిలో పనిచేసే నర్స్ చావుకు దగ్గరగా ఉన్న ఏకంగా ఐదుగురు గాయపడిన సైనికులను వరుసగా పెళ్లి చేసుకుందని.. వారు కన్నుమూసిన వెంటనే ఆ భారీ పరిహారాన్ని కాజేసిందని వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. అంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే ఈ నీచమైన అక్రమాల్లో కొందరు మిలిటరీ అధికారులు కూడా హస్తం కలిపారనే ఆరోపణలు రావడం. ఆ పరిహారంలో వచ్చే వాటాల కోసం సొంత సైనికులనే ఉద్దేశపూర్వకంగా అత్యంత ప్రమాదకరమైన మిషన్లకు పంపి బలిపశువులను చేస్తున్నారనే వార్తలు మానవత్వానికి మిగిలిన ఆఖరి బొట్టును కూడా తుడిచేస్తున్నాయి.
యుద్ధభూమిలో కంటిముందు సహచరులు చనిపోతుంటే ధైర్యంగా పోరాడే సైనికుడికి, తన వెనుక ఉన్న సమాజమే తన మరణాన్ని వ్యాపారంగా మార్చుకుందని తెలిస్తే ఆ ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఊహించడానికే భయమేస్తోంది. మాతృభూమి కోసం కన్నుమూసిన వీరుడి జ్ఞాపకాలు, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కనీసం అతడిని కన్న తల్లిదండ్రుల ఆకలి తీర్చాలి.. వారి శేష జీవితానికి ఆసరాగా నిలవాలి. కానీ ఇక్కడ ఆ పవిత్రమైన పరిహారం కామాంధుల, అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. ఈ అమానుష ఘటనలు కేవలం రష్యాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నాయి. మనుషుల్లో నైతిక విలువలు ఇంతగా దిగజారిపోవడం నిజంగా ఒక మానవీయ దుర్ఘటన.
