Begin typing your search above and press return to search.

అమెరికా ఆంక్షల నడుమ రష్యా గ్యాస్ కంపెనీల పరిస్థితి ఇది!

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అవిరామంగా కొనసాగుతోన్న వేళ, ఆ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని అమెరికా అధ్యక్షుడు విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   18 Aug 2025 3:00 PM IST
అమెరికా ఆంక్షల నడుమ  రష్యా గ్యాస్  కంపెనీల పరిస్థితి ఇది!
X

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అవిరామంగా కొనసాగుతోన్న వేళ, ఆ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని అమెరికా అధ్యక్షుడు విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ లో శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రష్యాలోని సహజవాయువు కేంద్రం నుంచి రెండు ట్యాంకర్లు కొనుగోలుదార్లను వెతుక్కుంటూ ఆసియాకు బయలుదేరిన విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... అమెరికా ఆంక్షలకు గురైన రష్యాలోని ఓ సహజవాయువు కేంద్రం నుంచి రెండు భారీ నౌకలు కొనుగోలుదార్లను వెతుక్కుంటూ ఆసియాకు బయల్దేరాయి. బ్లూమ్‌ బెర్గ్ సంకలనం చేసిన షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. సైబీరియాలోని ఆర్కిటిక్ ఎల్.ఎన్.జీ - 2 ప్లాంట్ నుండి సరుకులను మోసుకెళ్తున్న ఐరిస్, వోస్కోడ్ నౌకలు ఉత్తర సముద్ర మార్గం ద్వారా ఆసియాకు ప్రయాణించడం ప్రారంభించాయి.

నోవాటెక్ పీజేఎస్సీ నేతృత్వంలోని ఆర్కిటిక్ ఎల్.ఎన్.జీ - 2, 2030 నాటికి ఎల్.ఎన్.జీ. ఎగుమతులను మూడు రెట్లు పెంచాలనే రష్యా ప్రణాళికలకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో యూరప్‌ లోని ప్రధాన సాంప్రదాయ కొనుగోలుదారులకు పైప్‌ లైన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిన తర్వాత కొత్త గ్యాస్ మార్కెట్లను ఉపయోగించుకుంటుంది.

వాస్తవానికి ఆర్కిటిక్‌-2 ప్లాంట్‌ గత వేసవిలో సుమారు ఎనిమిది కార్గోలను ఎగుమతి చేసింది. అయితే... అక్టోబర్‌ నాటికి మంచు తీవ్రం కావడంతో కొనుగోలుదారులు దొరక్క ఉత్పత్తి నిలిపివేసింది. ఈ ప్లాంట్‌ పై బైడెన్‌ కార్యవర్గం ఆంక్షలు విధించిన తర్వాత ఈ ప్లాంట్ జూన్‌ లో లోడింగ్‌ ను తిరిగి ప్రారంభించింది.. కానీ, ఇంకా దిగుమతి సౌకర్యం వద్ద ఏ కార్గోను డాక్ చేయలేదు.

ఈ నేపథ్యంలో ఇక్కడినుంచి ఆసియాకు బయల్దేరిన నాలుగు నౌకలు కొనుగోలు దారులను వెతుక్కొంటూ ఆసియాకు బయల్దేరాయి. అవి చివరికి కొనుగోలుదారులను కనుగొంటాయో లేదో అనేది అస్పష్టంగా ఉన్న పరిస్థితి. ఈ సమయంలో మంచుతో నిండిన జలాల్లో సైతం ప్రయాణించగల నౌకలతో సహా దాదాపు డజను నౌకలను ఆర్కిటిక్ ఎల్.ఎన్.జీ - 2 కు సేవలందించడానికి నియమించారు.

కాగా... రష్యా నుంచి చమురు, సహజవాయువు అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్‌, చైనా ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విషయంలో భారత్ పై అమెరికా పెనాల్టీలు విధించిన విషయం తెలిసిందే. అందుకు వారు చెబుతున్న కారణం... రష్యా - భారత్ మధ్య వాణిజ్యం వల్ల ఉక్రెయిన్ తో యుద్ధం వేళ మాస్కోకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని!

మరోవైపు రష్యా నుంచి చమురు కనుగోలు చేసే విషయంలో చైనాపై మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన యూఎస్‌ విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో.. చైనాపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని.. అందుకే ఈ విషయంలో చైనాపై మాత్రం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు.