రుషికొండ ప్యాలెస్ ప్రభుత్వానికి గుదిబండగా మారిందా?
అయితే ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రుషికొండ ప్యాలెస్ వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుంది!
By: Raja Ch | 10 Oct 2025 5:00 PM ISTగత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.409 కోట్లతో విశాఖలో రుషికొండ ప్యాలెస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న ఈ ప్యాలెస్ మెయింటినెన్స్ ప్రభుత్వానికి గుదిబండగా మారిందని అంటున్నారు. ఈ మేరకు ఈ ప్యాలెస్ వినియోగంపై సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం కీలక విషయాలు వెల్లడించింది.
అవును... రుషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామి, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.... రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలి అనే అంశంపై ఈ మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ నేపథ్యంలో.. రుషికొండను ప్రజాప్రయోజనకర వినియోగానికి సిఫార్సులు చేసింది!
అయితే ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రుషికొండ ప్యాలెస్ వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుంది! ఇందులో భాగంగా... విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు ప్రభుత్వం భరించాల్సి వస్తోందని మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సందర్భంగా... ఈ అంశంపై ప్రతిపాదనలు, సలహాలను మంత్రులు పరిశీలించారు.
ఈ క్రమంలో... ఆతిథ్యరంగానికి హోటల్ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు. దీనిపై ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో.. త్వరలో ఈ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదిక సమర్పించనుంది.
కాగా... గతంలో పర్యాటక శాఖకు సుమారు రూ.7 కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితి. దీంతో.. ఈ సమస్యను ఎలా అధిగమించాలనే విషయంపై ప్రధానంగా సబ్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ భవనాలను ఇప్పటికే స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, మానసిక చికిత్సాలయంగా మార్చడం వంటి పలు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.
మరి.. వందల కోట్ల ప్రజాధనం వినియోగించిన ఈ ప్రాజెక్టును ఎలా సద్వినియోగం చేసి, పర్యాటక రంగంలో విశాఖపట్నానికి మరింత ఖ్యాతిని పెంచవచ్చనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
