Begin typing your search above and press return to search.

రుషికొండ...వైసీపీకి గుది బండ !

ఏమనుకుని చేశారో, ఏమి ఆశించి చేశారో లేక ఏ విధంగా అంచనాలు వేసుకున్నారో తెలియదు కానీ విశాఖలోని రుషికొండ మాత్రం వైసీపీకి రాజకీయంగా గుదిబండగా మారిపోయింది.

By:  Satya P   |   30 Aug 2025 1:00 PM IST
రుషికొండ...వైసీపీకి గుది బండ !
X

ఏమనుకుని చేశారో, ఏమి ఆశించి చేశారో లేక ఏ విధంగా అంచనాలు వేసుకున్నారో తెలియదు కానీ విశాఖలోని రుషికొండ మాత్రం వైసీపీకి రాజకీయంగా గుదిబండగా మారిపోయింది. కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్థితి తయారు అయింది. అధికారంలో ఉన్నపుడు ఏమి చేసినా చెల్లుతుంది అన్న ఆలోచనతో చేశారో ఏమో తెలియదు కానీ ఇపుడు దానికి భారీగానే రాజకీయ మూల్యం చెల్లించుకుంటోంది వైసీపీ అని అంటున్నారు. రుషికొండని టచ్ చేసి వైసీపీ ఇపుడు ఆపోసోపాలు పడుతోంది అని అంటున్నారు.

ఎందుకు సైలెంట్ గా :

నిజానికి ఏ ప్రభుత్వం అయినా ఒక అద్భుత కట్టడం నిర్మించాలనుకున్నపుడు విపరీతంగా ప్రచారం చేసుకుంటుంది. ఆ క్రెడిట్ తమకు దక్కేలా చూసుకుంటుంది. విశాఖలో రుషికొండ మీద పాత పర్యాటక భవనాలు తీసేసి కొత్తవి నిర్మించాలని అనుకున్నపుడు వాటి గురించి మంత్రులు కానీ కీలక నాయకులు కానీ ఎందుకు సవివరంగా చెప్పలేకపోయారు అన్న చర్చ నాటికీ నేటికీ ఉంది సైలెంట్ గానే మొత్తం రుషికొండ నిర్మాణం పనులు కానిచ్చేశారు. అక్కడ ఏమి జరుగుతోంది అన్నది బయట ప్రపంచానికి తెలియచేయాలని కూడా కనీస మాత్రంగా అనుకోలేదు అంటారు.

ఆంక్షలతో పెరిగిన అనుమానాలు :

ఇక రుషికొండ అంటే విశాఖ నడిబొడ్డున ఉన్న బ్రహ్మాండమైన పర్యాటక క్షేత్రం. అక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తూంటారు గతంలో హరితా రిసార్ట్స్ ఉండేవి. అలా దానికి కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చేది. అయితే 2021 లో పాత భవనాలు కూల్చడంతో వివాదం మొదలు అయింది. ఎందుకు కూలుస్తున్నారు అని విపక్షాలు నిలదీశాయి. అక్కడ ఏమి జరుగుతుందో తాము చూస్తామని కూడా డిమాండ్ చేశాయి. అయితే విపక్షాలకు చూసేందుకు సైతం అనుమతులు ఇవ్వలేదు. ఎన్నో ఆంక్షలు పెట్టారు. దాంతోనే మరింతగా అనుమానాలు అందరిలో పెరిగిపోయాయి. చంద్రబాబు పవన్ ఇలా అనేక మంది నాయకులు రుషికొండ మీద ఏమి జరుగుతుంది అన్నది చూడాలని అనుకున్నారు. కానీ వెళ్ళనీయని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ క్లారిటీ సైతం మిస్ :

ఇక రుషికొండ ప్రాంతం అంతా ప్రభుత్వానిదే. పర్యాటక శాఖకు సంబంధించినది. అయితే అక్కడ నిర్మిస్తున్న భవనాలు కూడా ప్రభుత్వానికే చెందుతాయి కదా. కానీ దానికి జగన్ ప్యాలెస్ అని విపక్షాలు అన్నపుడు అయినా కాదు అవి ప్రభుత్వ భవనాలు అని చెప్పలేకపోయారు. అంతే కాదు అవి దేని కోసం నిర్మిస్తున్నామో కూడా విడమరచి చెప్పలేకపోయారు. మరి ఎందుకు ఇంత రహస్యం పాటించారో కూడా ఎవరికీ అర్థం కాలేదు. దాంతో రుషికొండకు గుండు కొట్టిస్తున్నారు అన్న విపక్షాల ప్రచారం జనంలోకి పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది. అది కూడా ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం అయింది అంటారు.

భవనాలు ఓకే కానీ :

ఇక చూస్తే రుషికొండ మీద ఏకంగా 450 కోట్ల పైన రూపాయలతో వెచ్చింది నిర్మించిన భవనాలు ఐకానిక్ బ్రాండ్ గా వైసీపీ నేతలు ఇపుడు పెదవి విప్పి చెబుతున్నారు పైగా అవి ప్రభుత్వ భవనాలు అని కూడా అంటున్నారు. మరి వాటి గురించి గతంలో ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు అన్న ప్రశ్నలకు మాత్రం జవాబు లేదు. అలా వైసీపీ ఆనాడు నోరు నొక్కుకుని కూర్చోవడం వల్ల ఈ రోజు దాని క్రెడిట్ పక్కన పెడితే డెబిట్ ని పూర్తిగా మోయాల్సి వస్తోంది అని అంటున్నారు.

అసెంబ్లీలోనే బిగ్ డిబేట్:

ఇదిలా ఉంటే తొందరలోనే జరిగే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రుషికొండ భవనాల గురించి బిగ్ డిబేట్ పెడతారు అని అంటున్నారు. వందల కోట్ల ప్రజా ధనం వెచ్చింది నిర్మంచిన ఈ భవనాల వల్ల దుబారా అయింది అని అధికార పక్షం గట్టిగానే చెప్పనుంది. రుషికొండ మీద నిర్మించిన భవనాల నాణ్యత మీద కూడా నిగ్గదీయనుంది. పవన్ తాజాగా ఆ భవనాలను పరిశీలించినపుడు సీలింగ్ నుంచి పెచ్చులు ఊడటం కొన్ని చోట్ల లీకేజ్ ఇవ్వడంతో దీని మీద కూడా అసెంబ్లీలో చర్చించి వైసీపీని మరింతగా కార్నర్ చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ తన అయిదేళ్ళ పాలనలో ఎన్ని కట్టడాలు నిర్మించింది అన్నది పక్కన పెడితే రుషికొండను విశాఖకే తలమానికం చేద్దామనుకుందా లేక సీఎం అధికార నివాసం చేద్దామని అనుకుందా తెలియదు కానీ ఇపుడు అదే ఆ పార్టీకి అతి పెద్ద గుదిబండ గా మారుతోంది అని అంటున్నారు.