Begin typing your search above and press return to search.

తలపాగాను అవమానిస్తే.. రోల్స్ రాయిస్ తో సమాధానమిచ్చాడు

ఇతడి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కారు ధర కనిష్ఠంగా రూ.2.6 కోట్ల నుంచి రూ.8.5 కోట్ల వరకు పలుకుతుందని చెబుతారు.

By:  Garuda Media   |   25 Feb 2026 10:26 AM IST
తలపాగాను అవమానిస్తే.. రోల్స్ రాయిస్ తో సమాధానమిచ్చాడు
X

తన మతాచారాన్ని అవహేళన చేసినోడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా బదులు ఇవ్వటం మాత్రమే కాదు.. ఒక్కసారి ప్రపంచాన్ని ఆకర్షించిన ప్రత్యేకత భారత మూలాలున్న బ్రిటిషర్ రూబెన్ సింగ్ ను చెప్పాలి. తన మతాచారమైన తలపాగాను అవమానించిన తెల్లోడితో సవాలు విసిరి మరీ గెలిచిన గొప్పదనం ఇతగాడి సొంతం. భారత మూలాలున్న ఇతగాడు నేరుగా మనోడు కాకున్నా.. మన రక్తమే ఇతడిలోనూ ఉందన్నది మర్చిపోకూడదు. బ్రిటన్ బిల్ గేట్స్ గా కీర్తించే ఇతడి గురించి తెలిస్తే మాత్రం.. ఇతగాడి ఆత్మాభిమానానికి.. మతాభిమానానికి ఫిదా కావాల్సిందే.

అసలేం జరిగిందంటే.. భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ యూకేకు చెందిన వ్యాపారవేత్త. ఇతడికి దగ్గర దగ్గర 36 వ్యాపారాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఇతను ఒక బ్రిటీష్ వ్యక్తిని కలిశాడు. సదరు వ్యక్తి రూబెన్ సింగ్ ధరించిన తలపాగా (సిక్కులు ధరించే టర్బన్) గురించి చులకనగా మాట్లాడాడు. నీ తలపాగా నీ తలపై ఉన్న ఒక బ్యాండేజ్ మాదిరి ఉందన్నాడు. అతడి ఎగతాళి మాటలు.. జాతివివక్ష వ్యాఖ్యలు రూబెన్ సింగ్ ను తీవ్రంగా బాధించాయి. దీంతో.. తనకు ఎదురైన అవమానానికి బదులుగా సదరు తెల్లోడితో ఒక సవాలు విసిరాడు. వచ్చే వారంలో తాను ప్రతి రోజు ధరించే తలపాగా రంగుకు సరిపోయే రోల్స్ రాయిస్ కారులో కనిపిస్తానని చెప్పాడు. సదరు వ్యక్తి లైట్ తీసుకున్నా.. రూబెన్ సింగ్ మాత్రం సీరియస్ గా తీసుకున్నాడు.

తాను సవాలు విసిరినట్లే.. ఆ వారం మొత్తం ఏడు రోజులు.. తాను ధరించే వేర్వేరు రంగుల తలపాగాకు సరిగా మ్యాచ్ అయ్యేలా ఏడు వేర్వేరు రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశాడు. ఆ వారం పూర్తైన తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా తన తలపాగా తన కిరీటంగా పేర్కొంటూ అది తన గర్వంగా చెప్పాడు. దీంతో.. అతను ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అప్పటికే వ్యాపార రంగంలో తన సత్తా చాటుకున్న అతడు.. తన తీరుతో ఎందరికో ఫ్యాన్ గా మారాడు.

ఇదిలా ఉంటే అతనికి రోల్స్ రాయిస్ కార్లు విపరీతంగా నచ్చేయటమే కాదు.. 2019లో అతను ఒకేసారి ఆరు సరికొత్త రోల్స్ రాయిస్ కార్లను తన అభిరుచికి తగ్గట్లుగా ఆర్డర్ ఇచ్చి.. ఒకేసారి వీటిని కొనుగోలు చేయటం ద్వారా రికార్డు క్రియేట్ చేశారు. మామూలుగానే ఒక రోల్స్ రాయిస కార్ కొనేందుకే ఆలోచిస్తారు. అలాంటిది అందుకు భిన్నంగా రోల్స్ రాయిస్ కార్ల పిచ్చి గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఒక్క రోల్స్ రాయిస్ మాత్రమే కాదు..పలు విలాసవంతమైన కార్లు ఇతడి సొంతం. ఒక అంచనా ప్రకారం ఇతడి వద్ద ఏకంగా 15 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్ని ఇతర విలాసవంతమైన బ్రాండ్ కార్లు ఉన్నాయి. మొత్తంగా పాతిక వరకు ఖరీదైన కార్లు ఉన్నట్లు చెబుతారు. ఈ మొత్తం కార్ల విలువ రూ.100 కోట్ల నుంచి రూ.160కోట్ల విలువగా చెబుతారు. వీటిల్లో అత్యధికం కస్టమ్ మేడ్ గా కొనుగోలు చేయటం గమనార్హం.

ఇతడి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కారు ధర కనిష్ఠంగా రూ.2.6 కోట్ల నుంచి రూ.8.5 కోట్ల వరకు పలుకుతుందని చెబుతారు. అయితే.. తన అభిరుచికి తగ్గట్లు కార్లను ప్రత్యేకంగా తయారు చేయించటంతో అసలు కారు ధర కంటే 20 - 50 శాతం వరకు అధికంగా ఉండే వీలుందని చెబుతున్నారు. 17 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కేవలం నాలుగు గంటలే నిద్రపోయేవాడని చెబుతారు. మిగిలిన 20 గంటలూ పని చేసేవాడు. ఈ కారణంగా తక్కువ వ్యవధిలో బిల్ గేట్స్ గా అభివర్ణిస్తారు. 1998లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డస్ లో ఆయన ప్రపంచంలోనే అతి చిన్న వయసు ఉన్న సెల్ప్ మేడ్ మిలియనీర్ గా పేర్కొంటారు. ఇక.. ఇతగాడి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఇతను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక తన భార్య ఉందన్న విషయాన్ని గర్వంగా చెప్పటం విశేషం.

ఇతడి భార్య పేరు షానీ. ఆమె మిడిల్ ఈస్ట్ లో పెరిగిన అమ్మాయి.తన భార్యను సోషల్ మీడియాలో నా క్వీన్ అంటూ పేర్కొంటూ.. తన భార్య విషయంలో ఆమె తనకు ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని స్పష్టం చేయటం కనిపిస్తూ ఉంటుంది. పిల్లల విషయాలు బయటకు వివరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మొత్తానికి రోటీన్ కు భిన్నంగా కనిపించే ఇతడి మైండ్ సెట్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.