ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండుగ వేళ స్టాలిన్ మార్క్ షాక్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల వేడుకలు ప్రస్తుతం దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. 1925 విజయదశమి వేళ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది.
By: Satya P | 3 Oct 2025 9:25 AM ISTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల వేడుకలు ప్రస్తుతం దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. 1925 విజయదశమి వేళ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. అందుకే విజయదశమి రోజున దేశంలోని ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నింట్లోనూ ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో శతాబ్ది ఉత్సవాలలో పాల్గొని ఆర్ఎస్ఎస్ సేవలని కొనియాడిన నేపధ్యం ఉంది సరిగ్గా అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఆర్ఎస్ఎస్ కి భారీ షాక్ ఇచ్చేసింది.
సంఘీయుల మీద కేసులు :
ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద తమిళనాడు ప్రభుత్వం కేసులు పెట్టింది. అది కూడా వందేళ్ళ పండుగ వేళ, మరో వైపు దసరా వేడుకల వేళ. ఇంతకీ ఏమి జరిగింది అంటే తమిళనాడులోని పోరూర్ ప్రాంతం సమీపంలోని ఏకంగా ముప్పయి తొమ్మిది మంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలను చెన్నై పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇది ఇపుడు తమిళనాడులో రాజకీయంగా మంటలను పెడుతోంది. ఒక వైపు తమిళనాడు ఎన్నికలు ఆరు నెలల వ్యవధిలో ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ క్యాడర్ మీద ఇలా కేసులు పెట్టడం దూకుడు రాజకీయంగా బీజేపీ భావిస్తోంది.
కారణం ఇదేనా :
వందేళ్ళ పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శాఖలలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా తమిళనాడులో కూడా నిర్వహిస్తున్నారు. అయ్యప్పంతంగల్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారు మొదట గురు పూజ నిర్వహించి అనంతరం ప్రత్యేక శాఖ శిక్షణా కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాలు జరుగుతుండగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి సుమారుగా 39 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలో పూజ, ప్రత్యేక ఆర్ఎస్ఎస్ శిక్షణ నిర్వహించినందుకు అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
భగ్గుమన్న బీజేపీ :
దీని మీద బీజేపీ తమిళనాడుకు చెందిన నాయకులు భగ్గుమన్నారు. తమిళనాడు బీజేపీ నాయకురాలు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందర్ రాజన్ డీఎంకే ప్రభుత్వం తీరు మీద మండిపడ్డారు. స్టాలిన్ లా అండ్ ఆర్డర్ ని గాలికి వదిలేశారని అందుకే సంఘ విద్రోహ శక్తులు పెచ్చరిల్లుతున్నాయని అన్నారు. అదే సమయంలో దేశం కోసం పాటుపడుతున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇదేమి దుర్విధానమని ఆమె నిలదీస్తున్నారు. మరి ఆర్ఎస్ఎస్ క్యాడర్ ని శతాబ్ది ఉత్సవాల వేళ అరెస్ట్ చేయడం వెనక డీఎంకే రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఆర్ఎస్ఎస్ కి స్టాలిన్ షాక్ ఇచ్చారని అంటున్నారు
