Begin typing your search above and press return to search.

ఆర్ఎస్ఎస్ కి మోడీ భయపడుతున్నారా ?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ షార్ట్ కట్ లో ఆర్ఎస్ఎస్ గా ఉన్న ఈ సంస్థ ఎపుడూ చర్చలో ఉంటూనే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మీద ఎక్కువగా విపఖాలు మాట్లాడుతూంటాయి.

By:  Satya P   |   27 Aug 2025 9:22 AM IST
ఆర్ఎస్ఎస్ కి మోడీ భయపడుతున్నారా ?
X

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ షార్ట్ కట్ లో ఆర్ఎస్ఎస్ గా ఉన్న ఈ సంస్థ ఎపుడూ చర్చలో ఉంటూనే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మీద ఎక్కువగా విపఖాలు మాట్లాడుతూంటాయి. ఆర్ ఎస్ ఎస్ ని మత వాద సంస్థగా పేర్కొంటాయి. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో బీజేపీ ముందుకు వస్తూ ఉంటుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ కి రాజకీయ అంగంగా పనిచేస్తుంది అన్నది తెలిసిందే. ఆర్ఎస్ఎస్ కి అనేక అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఇక ఆర్ఎస్ఎస్ విషయం చూస్తే కనుక 1925లో ఈ సంస్థ బ్రిటిష్ ఇండియా హయాంలో ఏర్పాటు అయింది. ఆనాడు హిందువుల కోసం పనిచేసేందుకు ఏర్పాటు చేశారు అని చెబుతారు అయితే స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి అన్నది విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎపుడూ ప్రస్తావిస్తూంటాయి. అది వేరే విషయం కానీ ఇపుడు ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్యనే గ్యాప్ ఉందని వార్తలు రావడమే రాజకీయంగా ఆసక్తిని కలిగించే విషయంగా అంతా చూస్తున్నారు.

సంఘ్ వర్సెస్ బీజేపీనా :

ఇది ఎవరూ ఎపుడూ ఊహించనిదే. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ కి బీజేపీ ఎపుడూ విధేయంగా ఉంటుంది అని చెబుతారు. అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీకి మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటుంది. బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ పాటుపడుతూ ఉంటుంది. ఇలా సిద్ధాంతపరంగా ఒకే మార్గంలో పయనించే ఒక కొమ్మకు రెండు పూవులు లాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య గ్యాప్ వచ్చింది అంటేనే అది పెద్ద చర్చకు దారి తీస్తోంది అని అంటున్నారు. అయితే కాస్తా తరచి చూస్తే బీజేపీతో ఆర్ఎస్ఎస్ కి ఎలాంటి వివాదం లేదని బీజేపీకి నాయకత్వం వహిస్తూ దేశాన్ని నడుపుతున్న వారి విషయంలోనే విభేదాలు అని అంటున్నారు.

మోడీ ప్రభుత్వ విధానాల మీదనా :

కేంద్రంలో గత పదకొండేళ్ళుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. అయితే బీజేపీ ఏలుబడిలో కార్పొరేట్ సంస్థలకే పెద్ద ఎత్తున లాభాలు జరిగాయని దేశంలో పేదలు మధ్యతరగతి వర్గాలకు అనుకున్న స్థాయిలో ప్రయోజనం సమకూరలేదని విమర్శలు ఉన్నాయి. కార్పొరేట్ శక్తులకు అండగా ఉండడమే కాకుండా భారీ ఆర్ధిక ప్రయోజనాలు లభించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నది సంఘ్ కి నచ్చని విధానంగా ఉంది అని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ సమిష్టి నిర్ణయాలకు పెద్ద పీట వేయాలని ఆర్ఎస్ఎస్ బలంగా కోరుకుంటోంది అని చెబుతున్నారు. వ్యక్తి పూజకు బీజేపీని దూరంగా పెట్టాలని భావిస్తోంది. బీజేపీ గత పదకొండేళ్లుగా చూస్తే వివిధ రాష్ట్రాలలో సంస్థాగతంగా బలహీనం అయినట్లుగా ఆర్ఎస్ఎస్ భావిస్తోంది అని చెబుతున్నారు.

కొత్త నాయకత్వం కోసం :

సంస్థ శాశ్వతం వ్యక్తులు కాదు అన్నది ఆర్ఎస్ఎస్ ప్రాథమిక సూత్రం అని అంటున్నారు. అయితే దానికి విరుద్ధంగా బీజేపీలో జరుగుతున్న తీరు పట్ల సంఘ్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. అందుకే 75 ఏళ్ళకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ పరోక్షంగా సూచనలు ఇస్తోంది అని అంటున్నారు ఆ మధ్యన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇదే విషయం మీద గట్టిగానే మాట్లాడారు. మోడీ ఈ సెప్టెంబర్ 17తో 75 ఏళ్ళకు చేరువ అవుతున్న వేళ ఆర్ఎస్ఎస్ చేసిన సూచన ఆయన గురించే అని అంతా అంటున్న నేపథ్యం ఉంది.

సంఘ్ పట్టు అలాంటిది :

ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయని అంతా అనుకుంటూ వస్తున్నారు. వాటి విషయంలో బీజేపీ పెద్దలు కూడా పట్టించుకోలేదు. కానీ ఎపుడైతే 75 ఏళ్ళకే రాజకీయాలకు దూరం పాటించాలి అన్న రూల్ ని ఆర్ ఎస్ ఎస్ వల్లించడం మొదలెట్టిందో బీజేపీ పెద్దలకు కొంత కంగారు మొదలైంది అని అంటున్నారుఇ. నరేంద్ర మోడీ అయితే గత పదకొండేళ్ళుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఎపుడూ వెళ్ళలేదు అని గుర్తు చేస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన వెళ్ళి అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని మీద శివసేన ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు తన పదవిని నిలబెట్టుకోవడం కోసమే మోడీ ఆ విధంగా వెళ్లారు అని కూడా సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 17లో మోడీ పదవి పూర్తి అవుతుందని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అలా తొలిసారిగా మోడీ 75వ పుట్టిన రోజుని ముడిపెట్టి ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడడం జరిగింది.

ఆర్ఎస్ఎస్ కి ప్రశంసలు :

ఇక ఈ మధ్య జరిగిన ఎర్ర కోట మీద స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోడీ చేసిన వంద నిముషాలకు పైగా ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ దేశానికి గత వందేళ్ళలో చేసిన సేవలను ఆయన ఎంతగానో కొనియాడారు. నిజానికి స్వాతంత్ర వేడుకలలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎందుకు అన్నది విపక్షాలు సంధించిన ప్రశ్న ఆర్ఎస్ఎస్ కి స్వాతంత్రానికి సంబంధం ఏమిటి అని కూడా వారు విమర్శించారు. అయితే ఆర్ఎస్ఎస్ ని ప్రసన్నం చేసుకోవడం కోసమే మోడీ ఈ విధంగా వ్యవహరినారు అని కూడా వారే చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ కి మోడీ భయపడుతున్నారని కూడా విమర్శించారు.

భయం నిజమేనా :

ఆర్ఎస్ఎస్ కి మోడీ భయపడడం నిజమేనా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే అలాగే ఉంది అని అంటున్నారు నిజానికి మోడీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. ఆయనకు ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది అన్నది బాగా తెలుసు అని అంటారు. ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంటే అది అమలు చేసేందుకు ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా మోడీ కంటే ఎవరికీ బాగా తెలియదు అంటారు ఈ రోజున బీజేపీలో అత్యధికులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి రాజకీయంగా కీలకమైన పదవులు చేపట్టిన వారే అని అంటారు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి విధేయత ఈనాటికీ ఉంది. ఆర్ఎస్ఎస్ ఒక్క మాట చెబితే శిరోధార్యంగా పాటిస్తారు. ఎందరో నేతలు ఆర్ఎస్ఎస్ నిర్ణయాలకు తలొగ్గి తమ పదవులు వదులుకున్నారు. అందులో 2009 తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎల్కే అద్వానీ కూడా పదవీ త్యాగం చేశారు అని గుర్తు చేస్తారు.

ఆర్ఎస్ఎస్ తలచుకుంటే :

ఇక ఆర్ఎస్ఎస్ మొత్తం బీజేపీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని నిర్ణయించుకుంది అని అంటున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఆర్ఎస్ఎస్ నుంచి నియమించాలని చూస్తోంది అంటున్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ మనసెరిగి ఉప రాష్ట్రపతి పదవికి సంఘ్ బంధం ఉన్న సీపీ రాధాకృష్ణన్ ని మోడీ అండ్ కో ఎంపిక చేసింది అని అంటున్నారు. ఇపుడు జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ మాట నెగ్గుతుంది అని అంటున్నారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో సెప్టెంబర్ 5 నుంచి 7 మధ్యలో మూడు రోజుల పాటు జరిగే ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడి మీద కసరత్తు ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా మోడీ విషయంలో ఏమైనా సూచనలు ఉంటాయా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ విషయంలో మోడీ అండ్ కో సీరియస్ గా ఆలోచిస్తోందని అంటున్నారు