ఆర్ఎస్ఎస్ లో ముస్లింలు.... భగవత్ హాట్ కామెంట్స్ !
ఆర్ఎస్ఎస్ అంటేనే హిందూ వాద సంస్థ అన్న భావన ఉంది. దాంతో ఆర్ఎస్ఎస్ ని విపక్షాలు గిట్టని వారు అలాగే విమర్శలు చేస్తారు.
By: Satya P | 10 Nov 2025 9:30 AM ISTరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ షార్ట్ కట్ లో ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాలో ఎపుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కి రాజకీయం లేదు దేశ హితం తప్ప మతం కులం లేదని పెద్దలు ఎన్ని సార్లు చెబుతున్నా విమర్శలు అదే పనిగా వస్తూనే ఉంటాయి. అయితే గత పదిహేనేళ్ళుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ గా కొనసాగుతున్న మోహన్ భగవత్ అయితే ఆర్ఎస్ఎస్ విషయంలో అనేక సందేహాలకు ఎప్పటికప్పుడు జవాబులు ఇస్తూనే ఉన్నారు. అంతే కాదు ఆయన కొన్నిసార్లు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఆర్ఎస్ఎస్ విషయంలో ఆయన ఆలోచనలు చర్యలు ఉంటున్నాయి. తాజాగా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ముస్లిములు చేరొచ్చా :
ఆర్ఎస్ఎస్ అంటేనే హిందూ వాద సంస్థ అన్న భావన ఉంది. దాంతో ఆర్ఎస్ఎస్ ని విపక్షాలు గిట్టని వారు అలాగే విమర్శలు చేస్తారు. ఈ నేపధ్యంలో బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ కి ఒక మౌలికమైన ప్రశ్న ఎదురైంది. ఆర్ఎస్ఎస్ అంటే మత సంస్థ అంటారు కదా ముస్లింలు అందులో చేరవచ్చా ఒకవేళ వారు సమ్మతిస్తే చేర్చుకుంటారా అన్న దాని మీద స్పందిస్తూ ఆయన హాట్ కామెంట్స్ చేసారు. ఈ నేపధ్యంలో ఆర్ఎస్ఎస్ గురించి ఆయన మరోసారి దేశానికి వివరంగా తెలియచేసే ప్రయత్నం చేశారు. ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో చేరవచ్చు. వారు భారత మాత బిడ్డలుగానే ఆర్ఎస్ఎస్ లోకి వస్తారు, అలాగే కొనసాగుతారు అని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక్కటే నినాదం :
ఆర్ఎస్ఎస్ కి కులం మతం ప్రాంతం ఇవన్నీ లేవని ఒక్కటే మతం అభిమతం అని ఆయన అన్నారు. అదే భారత మాత కోసం పనిచేయడమే అని విపులీకరించారు ఆర్ఎస్ఎస్ లోకి వచ్చేవారు దేశం మొదటిది అన్న భావనతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆర్ఎస్ఎస్ కి రాజకీయాలు అన్నవి లేవని అధికారంలోకి రావాలన్న కోరిక కానీ అధికారంలోకి పార్టీలను తెచ్చి మద్దతు ఇవ్వాలన్నది కానీ అసలు ఏమీ లేవని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ లెక్క మా వద్ద లేదు :
ఆర్ఎస్ఎస్ ఉన్న వారిలో ఎందరు బ్రాహ్మణులు ఇతర కులాల వారు ఎందరు, అలాగే ఎవరు ఏ మతానికి చెందిన వారు అన్న లెక్క తమ వద్ద ఎపుడూ ఉండదని అంతే కాదు ఆర్ఎస్ఎస్ లో అలాంటి వివక్ష ఏనాటికీ
ఉండదని మోహన్ భగవత్ అంటున్నారు. దేశానికి నిస్వార్ధంగా సేవ చేయాలని అనుకునే వారికి ఒక వారధిగా ఉత్తమ సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉందని ఆయన గుర్తు చేశారు. తమ సంస్థకు రిజిస్ట్రేషన్ లేదని విపక్షాలు అంటున్నాయి. బ్రిటిష్ కాలంలో పుట్టిందని బ్రిటిష్ వారి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోమంటారా అని కాంగ్రెస్ వంటి పార్టీల ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
ప్రజలు నమ్మలేదు :
ఆర్ఎస్ఎస్ ని ప్రజలు నమ్మలేదని మోహన్ భగవత్ అన్నారు. ఒక దశలో ప్రజానీకం తమ సంస్థ విషయంలో అలాగే చూశారని అయితే కాలక్రమంలో ప్రజలు అంతా అర్ధం చేసుకుని మద్దతుగా నిలిచారని ఈ రోజున ఆర్ఎస్ఎస్ వందేళ్ళకు చేరువ అయిందంటే అది ప్రజల మద్దతు సహకారమే అని మోహన్ భగవత్ వివరించారు. ఆర్ఎస్ఎస్ ని ఈ దేశంలో మూడు సార్లు నిషేధించారు అయినా న్యాయం తమ వైపు ఉంది కాబట్టే బయట ఉన్నామని ప్రజలకు సేవ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
