మహారాష్ట్ర భారీ ల్యాండ్ స్కాం.. ఓ వృద్ధుడు.. ఓ సోషల్ యాక్టివిస్ట్
అమెడియా ఎంటర్ ప్రైజెస్ అనేది పార్థ్ పవార్ కు చెందినది. దీనికి రూ.18 వేల కోట్ల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని 300 కోట్లకే కేటాయించడం మహారాష్ట్రలో తీవ్ర వివాదంగా మారింది.
By: Tupaki Political Desk | 9 Nov 2025 10:01 AM ISTఈ వయసులో మనకెందుకులే అని అతడు ఊరుకోలేదు.. పెద్దవాళ్లతో మనకెందుకు గొడవ అని కూర్చోలేదు.. రూ.వేల కోట్ల భూమిని కారుచౌక కొట్టేస్తుండడాన్ని కనిపెట్టారు.. తర్వాత దాని పని పట్టేందుకు మార్గం వేశారు..! ఇదంతా మహారాష్ట్రను కుదిపేసిన భారీ భూ కుంభకోణం వెలుగులోకి రావడం వెనుక ఉన్న కథ. ఇందులో సాధారణ వ్యక్తులు ఉంటే పెద్ద విషయం కాకపోయేది.. కథనం ఆ రాష్ట్రం దాటకపోయేది..! కానీ, ఏకంగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కు సంబంధం ఉండడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకూ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరు? అంటే దినకర్ కోట్కర్ అనే వ్యక్తి. 60 ఏళ్ల కోట్కర్... పార్థ్ పవార్ తో లింక్ ఉన్న కంపెనీకి భూములు కట్టబెట్టడంపై తొలుత ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్)కు ఫిర్యాదు చేశారు.
వివాదంలో కుమారుడు... అజిత్ కలవరం...
అమెడియా ఎంటర్ ప్రైజెస్ అనేది పార్థ్ పవార్ కు చెందినది. దీనికి రూ.18 వేల కోట్ల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని 300 కోట్లకే కేటాయించడం మహారాష్ట్రలో తీవ్ర వివాదంగా మారింది. ఐటీ, పారిశ్రామిక కేంద్రమైన పుణెలోని ముద్వా ప్రాంతంలో ఉందీ భూమి. ప్రభుత్వానికి చెందిన దీనిని మహర్ పతన్ భూమిగా పేర్కొంటారు. అయితే, ఎలాంటి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేకుండానే అమెడియాకు విక్రయించారు. దీంతో ఫడణవీస్ సారథ్యంలోని బీజేపీ-ఎన్సీపీ-శివసేన సర్కారుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. చివరకు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేసిన సర్కారు.. దర్యాప్తునకు టీమ్ ను ఏర్పాటు చేసింది.
సీఎంతో అజిత్ భేటీ...
తన కుమారుడి సంస్థకు కారుచౌకగా భూ కేటాయింపు మెడకు చుట్టుకునేలా ఉండడంతో అజిత్ పవార్ నష్ట నివారణ చర్యలకు దిగారు. సీఎం ఫడణవీస్ తో సమావేశమయ్యారు. అనంతరం అమెడియాకు భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి చెందిన భూమి అని తన కుమారుడు పార్థ్, అతడి బిజినెస్ పార్ట్ నర్ దిగ్విజయ్ పాటిల్ కు తెలియదని చెప్పారు. లావాదేవీలు జరగకున్నా... రిజిస్ట్రేషన్ జరిగిందని, దీనికి బాధ్యులెవరో త్వరలో తేలుస్తామని తెలిపారు. పార్థ్ కంపెనీ భూమి బదలాయింపునకు తాను ఒత్తిడి చేయలేదన్నారు.
ఎవరా సోషల్ యాక్టివిస్టు..??
ఈ భూమి వివాదంలో అసలు మలుపు ఇది. ఐజీఆర్ కు దినకర్ కోట్కర్ లేఖ రాసినా స్పందన రాలేదు. అయితే, ఆ లేఖ ఓ సోషల్ యాక్టివిస్టు చేతిలో పడ్డాక కథ మారింది. ఆ యాక్టివిస్టు పరిశీలనలో.. భూ రికార్డులు ట్యాంపర్ అయినట్లు తేలింది. అధికారుల ప్రాథమిక విచారణలోనూ అక్రమాలు నిజమని తేలడంతో రిజిస్ట్రేషన్ రద్దయింది. ఏకంగా రూ.18 వేల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి మిగిలింది.
