Begin typing your search above and press return to search.

పని మనుషులుగా చేరి రూ.18 కోట్లు కొట్టేసిన దంపతులు

సంపన్నుల ఇళ్ల్లను టార్గెట్ చేసుకొని వారి ఇళ్లల్లో సహాయకులుగా, పని మనుషులుగా పని చేస్తూ.. దోచేసే దొంగలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు.

By:  Garuda Media   |   29 Jan 2026 9:26 AM IST
పని మనుషులుగా చేరి రూ.18 కోట్లు కొట్టేసిన దంపతులు
X

సంపన్నుల ఇళ్ల్లను టార్గెట్ చేసుకొని వారి ఇళ్లల్లో సహాయకులుగా, పని మనుషులుగా పని చేస్తూ.. దోచేసే దొంగలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒక భారీ చోరీకి పాల్పడ్డారు ఇంటి పనిమనుషులు. ఆ మాటకు వస్తే.. తాము టార్గెట్ చేసిన ఇంటిని దోచేందుకు పని మనుషులుగా నటిస్తూ.. ఆ ఇంట్లోకి చేరి.. అవకాశం చూసుకొని దోపీడికి పాల్పడిన ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని మారతహళ్లి కెంపాపుర రోడ్డులోని రియల్ ఎస్టేట్ వ్యాపారి కం బిల్డర్ గా వ్యవహరించే శివకుమార్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.18 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు, వెండి సామాగ్రిని దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని వారీ దారుణానికి పాల్పడ్డారు. పని మనుషులుగా చేరిన నేపాలీ దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాధితుల కథనం ప్రకారం తమకు తెలిసిన సహాయకుల ద్వారా ఇరవై రోజుల క్రితం 32 ఏళ్ల దినేశ్, 25 ఏళ్ల కమల దంపతులు ఇంట్లో పనికి కుదిరారు. ఆదివారం శివకుమార్ ఊరికి వెళ్లగా, ఆయన భార్య, తల్లి, కొడుకు బంధువుల ఇంట్లో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో దినేశ్, కమల దంపతులు తమ దోపిడీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సాయంగా మరో ముగ్గురిని ఇంటికి రప్పించుకున్నారు. ఇంట్లోని మొదటి అంతస్తులోని కప్ బోర్డును ధ్వంసం చేసి అందులోని 11.5 కేజీల బంగారం, వజ్రాభరణాలు, 5 కేజీల వెండి, రూ.11.50 లక్షల నగదును దోచుకున్నారు. ఇదంతా గమనించిన వంట మనిషి అంబిక యజమానులకు ఫోన్ చేసి వారు చేసిన చోరీ గురించి సమాచారాన్ని అందించారు. నమ్మి పనికి పెట్టుకున్న పనిమనుషులు చేసిన ఘటనకు ఆ కుటుంబం షాక్ కు గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.