Begin typing your search above and press return to search.

ఈ ముగ్గురికి పాస్ పోర్ట్ ఉండదు.. అన్ని దేశాలు తిరగవచ్చు..

ఈ ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వీరికి పాస్‌పోర్ట్‌ అవసరం లేదు.

By:  Tupaki Political Desk   |   22 Oct 2025 5:00 PM IST
ఈ ముగ్గురికి పాస్ పోర్ట్ ఉండదు.. అన్ని దేశాలు తిరగవచ్చు..
X

ప్రపంచం ఎంత సాంకేతికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందినా — ఒక దేశ సరిహద్దు దాటాలంటే పాస్‌పోర్ట్‌ అవసరమే. గ్లోబల్ లీడర్ మోడీ అయినా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయినా.. ఆ సరిహద్దు నియమాలు తప్పించుకోలేరు. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. ఈ ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వీరికి పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. వీరి పేర్లు కేవలం రాజ్యాధికారంలోనే కాకుండా.. అంతర్జాతీయ మర్యాదల్లో కూడా ప్రత్యేక స్థానం పొందాయి. వారు శక్తికి ప్రతీకలు, కానీ శాసనానికి అతీతమైన గుర్తింపు కలిగిన వారు.. వీరే బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III, జపాన్‌ సామ్రాట్‌ ఎంపరర్‌ నరుహిటో, జపాన్‌ సామ్రాజ్ఞి మసాకో.

మొదటగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రతి పాస్‌పోర్ట్‌ కూడా ‘హిస్‌ మెజెస్టీ పాస్‌పోర్ట్‌’ పేరుతో రాజు తరఫున జారీ అవుతుంది. అంటే దేశంలోని ప్రతి ఒక్కరికి పాస్‌పోర్ట్‌ ఇచ్చేది ఆయనే. అప్పుడు ఆయనే తనకోసం పాస్‌పోర్ట్‌ జారీ చేసుకోవాలా? అనే ప్రశ్నే లాజికల్‌గా కాదు. ఆయన సార్వభౌమాధికారానికి ప్రతీక కనుక ఆయనను ఎటువంటి దేశం కూడా ‘ప్రవేశ అనుమతి’ అడగదు. క్వీన్‌ ఎలిజబెత్‌ II కాలంలో కూడా ఇదే నియమం అమల్లో ఉండేది. చార్లెస్‌ సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఈ ప్రత్యేక రాజ్యాధికార మరింత బలపడింది. ప్రపంచంలో ఎక్కడికైనా ఆయన పర్యటనయు వెళ్తే, అది వ్యక్తిగత ప్రయాణం కాదు బ్రిటన్‌ రాజ్యాధికారానికి ప్రతీకగా పరిగణించబడుతుంది.

రెండో వ్యక్తి జపాన్‌ సామ్రాట్‌ ఎంపరర్‌ నరుహిటో

జపాన్‌ రాజ్యాంగం ప్రకారం.. ఆయన ఒక ప్రతీకాత్మక అధినేత. అధికారికంగా ఆయన రాజకీయ నిర్ణయాల్లో పాల్గొనరు. కానీ ఆయన ఉన్నత స్థానం కలిగిన వ్యక్తి. దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా ఆయనను చూస్తారు. 1971లో జపాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం.. జపాన్‌ సామ్రాట్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు పాస్‌పోర్ట్‌ ఉండదని, విదేశీ పర్యటనలు అన్ని ‘రాజ పర్యటనలు’గా పరిగణించబడతాయి. అందువల్ల, ఆయనను ఎటువంటి దేశం కూడా సాధారణ ప్రయాణికుడిగా చూడదు. ఆయన అడుగుపెట్టే ప్రతి ప్రదేశం.. రాజ్యాధికార ప్రతిష్ఠతో స్వాగతం పొందుతుంది.

ఇక సామ్రాజ్ఞి మసాకో

ఈ ప్రత్యేక హక్కులో భాగస్వామి. ఎంపరర్‌ నరుహిటోతో పాటు ఆమె ప్రపంచ పర్యటనలకు వెళ్లినప్పుడు.. ఆమె ప్రయాణాలు కూడా అదే రాజ్యాధికార విభాగంలో పరిగణించబడతాయి. జపాన్‌ సంస్కృతిలో సామ్రాజ్ఞి స్థానం ఎంతో పూజించతగినదిగా ఉంటుంది. ఆమె పర్యటనలు కేవలం దౌత్య పరమైనవే కాదు.. అవి సాంస్కృతిక ప్రతిష్ఠను ప్రపంచానికి పరిచయం చేసే ఒక ప్రతీకగా భావిస్తారు.

ఈ ముగ్గురికే ఎందుకు?

ఎందుకంటే వీరు కేవలం వ్యక్తులు కాదు దేశాధికార ప్రతీకలు. వీరి వ్యక్తిగత గుర్తింపును వేరు చేయడం అంటే.. వారి దేశాన్ని అవమానించడం లాంటిది. అంతర్జాతీయ రాజ్యాంగం, దౌత్య ప్రోటోకాల్‌ ప్రకారం వీరిని దేశపు ప్రతినిధులుగా కాకుండా, దేశాలే మానవ రూపంలో ఉన్నట్టుగా పరిగణిస్తారు. అందుకే ప్రపంచంలోని ఏ సరిహద్దు వీరికి అడ్డుగా ఉండదు.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ ముగ్గురికీ పాస్‌పోర్ట్‌ లేకపోయినా, ప్రపంచంలోని అత్యున్నత భద్రతా బలగాలు వీరిని రక్షిస్తాయి. వీరి పర్యటనలు ‘అత్యున్నత రక్షణ మిషన్‌’గా పరిగణించబడతాయి. ఒక్క అడుగు ముందుకేయడానికి కూడా ముందుగా దౌత్య చర్చలు జరుగుతాయి. అంతర్జాతీయ ప్రోటోకాల్స్ వీరి పర్యటనలకు అమలు అవుతాయి.

మోడీ, బైడెన్‌, ట్రంప్‌, పుతిన్‌ వంటి నేతలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగి ఉన్నా.. వీరంతా అంతర్జాతీయ ప్రయాణాలకు పాస్‌పోర్ట్‌, వీసా తప్పనిసరిగా వాడాల్సిందే. కానీ కింగ్‌ చార్లెస్‌, ఎంపరర్‌ నరుహిటో, సామ్రాజ్ఞి మసాకో వీరు దానికి అతీతులు. ఇది వీరి వ్యక్తిగత శక్తి కాదు.. అది వారి రాజ్యాధికార చిహ్నం.

ఒక విధంగా చెప్పాలంటే, వీరు ‘జాతి ప్రతీకలు’ దేశాలు వీరికి పాస్‌పోర్ట్‌ ఇవ్వడం కాదు.. వీరిని పాస్‌పోర్ట్‌లా ఉపయోగిస్తాయి. వారి ఒక సందర్శనతోనే దౌత్య సంబంధాలు బలపడతాయి, వారి చిరునవ్వుతోనే వందల కోట్ల విలువైన ఒప్పందాలు కుదురుతాయి. ప్రపంచం సరిహద్దుల మీద నిర్మించబడింది, కానీ ఈ ముగ్గురి పేర్లు ఆ సరిహద్దులను దాటి నిలబడ్డాయి. వీరి గుర్తింపు కాగితం మీద ముద్రించబడిన పాస్‌పోర్ట్‌లో కాదు.. అది చరిత్రలో చెక్కబడిన అధికార సంతకం.