నగరిలో రోజాకు ఛాన్స్ పోతోందా.. ?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయాలకు భిన్నమైన వాతావరణం ఇప్పుడు మరింత నెలకొంది.
By: Garuda Media | 24 Jan 2026 10:00 PM ISTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయాలకు భిన్నమైన వాతావరణం ఇప్పుడు మరింత నెలకొంది. ఇది మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నాయకురాలు, ఫైర్‌బ్రాండ్ రోజాకు సెగ పెంచుతోందన్న చర్చకు దారితీస్తోంది. నగరి లోని పలు మండలాల్లో ఒకప్పుడు రోజా జపం వినిపించింది. కానీ, గత ఎన్నికలకు ముందు నుంచి ఆమె పేరు వినిపించడం లేదు.
ఇక, ఇప్పుడు మరింతగా రోజా పేరు వినిపించకుండా పోవడం గమనార్హం. నగరిలో.. నిండ్ర, విజయపురం, నగరి, పుత్తూరు, వడమాల పేట మండలాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికలకు ముందు వరకు నిండ్ర, వడమాలపేట మండలాల్లో రోజాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడే ఆమె తరచుగా పర్యటించే వారు కూడా. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మండలాల్లోనే ఎక్కువగా కార్యక్రమాలు చేపట్టారు. తనకు ఫాలోయింగ్ ఉన్న మండలాలుగా కూడా రోజా వీటి గురించే చెబుతారు.
ఇక, నగరి మండంలో రోజాను అభిమానించేవారు ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉండేవారు. కానీ, విజయపురం, పుత్తూరులో మాత్రం ఆమెకు భారీ వ్యతిరేకతతో పాటు.. ఇక్కడి వైసీపీ వర్గాలు కూడా రెండుగా విడిపోయాయి. ఇది గత ఎన్నికలకు ముందే జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. దీంతో నిండ్ర, వడమాల పేటలను రోజా నమ్ముకున్నారు. తరచుగా ఇక్కడే కార్యక్రమా లు చేపట్టేవారు.
కానీ.. ఇప్పుడు ఆ రెండు మండలాల్లోనూ రోజా హవా తగ్గుముఖం పట్టిందన్న చర్చసాగుతోంది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్.. తన అనుకూల మండలాలతోపాటు.. తమ బలం తక్కువగా ఉన్న మండలాలపైనా ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ అమలు చేస్తున్నారు. వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో నిన్నటి వరకు అంతో ఇంతో బలంగా ఉన్న .. నిండ్ర, వడమాల పేటలో ఇప్పుడు రోజా వచ్చినా పెద్దగా స్వాగత సత్కారాలు లభించడం లేదు. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
