Begin typing your search above and press return to search.

'జుపుప్సాకర వ్యాఖ్యలు'... కొండా సురేఖను గట్టిగా తగులుకున్న రోజా!

ఈ వ్యవహారంలో సమంత విడాకుల విషయాన్ని సురేఖ ప్రస్థావించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2024 5:06 PM GMT
జుపుప్సాకర వ్యాఖ్యలు... కొండా సురేఖను  గట్టిగా తగులుకున్న రోజా!
X

బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా, ఇదే సమయంలో టాలీవుడ్ నటీనటులపైనా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటూ సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సమంత విడాకుల విషయాన్ని సురేఖ ప్రస్థావించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పందించిన అక్కినేని నాగార్జున... కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని సూచిస్తూ.. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని డిమాండ్ చేశారు.

అంతకంటే ముందే ఇదే వ్యవహారంపై ఘాటుగా స్పందించారు ప్రకాశ్ రాజ్. ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు.

అవును... టాలీవుడ్ హీరోయిన్ సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే రోజా స్పందించారు. అక్కినేని నాగార్జున కుటుంబం పైనా, ప్రత్యేకించి టాలీవుడ్ హీరోయిన్ సమంతపైనా చేసిన జుగుప్సకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సురేఖకు కీలక ప్రశ్న సంధించారు రోజా.

ఈ సందర్భంగా... కొండా సురేఖపై బీఆరెస్స్ అనునయులు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించిందని.. ఆ సందర్భంగా తీవ్ర ఆవేదనకు గురైన ఆమె అంతకంటే హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం అని.. ఆ పని మహిళే చేయటం మరింత బాధిస్తోందని.. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు రోజా ఎక్స్ వేదికగా స్పందించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై సమంత స్పందిస్తూ... తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని.. విడాకులనేవి పూర్తిగా తన వ్యక్తిగత విషయం అని తెలిపింది. ఇదే సమయంలో తమ విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని చెప్పిన సమంత.. అనవసరంగా తనను రాజకీయాల్లోకి లాగొద్దని.. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉంటానని తెలిపింది.