నాయకత్వ లక్షణాలే రోజా కుమార్తె అన్షుకు ఈ అఛీవ్‌మెంట్‌ని తెచ్చాయా?
సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక్ సెల్వమణి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచారు.
By: Sivaji Kontham | 17 May 2026 11:52 PM ISTసినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక్ సెల్వమణి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచారు. అమెరికాలోని ప్రసిద్ధ `ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్` లో తన ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన అన్షు ఇప్పుడు అధికారికంగా గ్రాడ్యుయేట్ అయ్యారు. కేవలం పట్టా అందుకోవడమే కాకుండా.. యూనివర్సిటీలోనే అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. సెలబ్రిటీ వారసుల్లో అన్షు మాలిక్ ఎంతో క్రమశిక్షణతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంతటి గొప్ప ఎత్తుకు ఎదగడంపై టాలీవుడ్ వర్గాల్లో.. అలాగే పొలిటికల్ కారిడార్ లో.. సామాజిక మాధ్యమాలలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అన్షు మాలిక్ అమెరికా విద్యాభ్యాసంలో అత్యుత్తమమైన మెరిట్‌తో దూసుకుపోయారు. ఇండియానా యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ హానర్స్ లో హైయెస్ట్ డిస్టింక్షన్ తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం విశేషం. విదేశాల్లో చదువుకుంటూనే అక్కడ అన్షు మాట్లాడే యూఎస్ ఇంగ్లీష్ యాక్సెంట్.. తన కమ్యూనికేషన్ స్కిల్స్ పలువురిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తోటి సెలబ్రిటీల పిల్లలు చాలామంది గ్లామర్ ఫీల్డ్ వైపు మొగ్గు చూపుతుంటే అన్షు మాత్రం కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి సాంకేతిక రంగాలలో తన ప్రతిభను నిరూపించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ విద్యా సంవత్సరంలో అన్షు సాధించిన విజయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది `హెర్మన్ బి వెల్స్ అవార్డు` . ఇండియానా యూనివర్సిటీలో 1961 నుండి ఇస్తున్న ఈ అత్యున్నత అవార్డును ప్రతి సంవత్సరం కేవలం ఒకే ఒక్క అత్యుత్తమ విద్యార్థికి మాత్రమే అందిస్తారు. కేవలం చదువులోనే కాకుండా.. నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ వంటి రంగాల్లో ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించినందుకు గాను ఈ ఏడాది అన్షు మాలిక్‌ను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకున్న విజేతల పేర్లను యూనివర్సిటీకి చెందిన ఇండియానా మెమోరియల్ యూనియన్ లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు. ఇది తనకు దక్కిన లైఫ్‌టైమ్ లెగసీ అని చెప్పాలి.
తన కుమార్తె సాధించిన ఈ అద్భుతమైన విజయంపై ఇదివరకూ తల్లి రోజా సెల్వమణి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. అన్షు చూపించిన అంకితభావం, ధైర్యం, కష్టపడే తత్వమే తనను ఈ స్థానంలో నిలబెట్టాయని కొనియాడారు. ఒక చిన్న కలగా ప్రారంభమైన అన్షు ప్రయాణం ఈ రోజు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలా ఒక అద్భుతమైన విజయంగా రూపాంతరం చెందిందని రోజా గర్వంగా పేర్కొన్నారు. చదువుతో పాటు ఆర్ట్ ఫర్ ఎ కాజ్ వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో అన్షు చురుగ్గా పాల్గొనడం ఒక తల్లిగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తను రాసుకొచ్చారు.
గ్లోబల్ స్టేజ్ పై ఒక తెలుగు అమ్మాయి, అందునా టాలీవుడ్ సెలబ్రిటీ వారసురాలు ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకోవడం నిజంగా అభినందనీయం. అధికారికంగా గ్రాడ్యుయేట్ అయినప్పటి అన్షు స్టిల్స్.. గతంలోని అవార్డు వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. నెటిజన్లు, సినీ అభిమానులు, రాజకీయ ప్రముఖులు అన్షు మాలిక్ సాధించిన ఈ గ్రేట్ అచీవ్‌మెంట్‌పై హర్షం వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో ఈ యువప్రతిభావని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. తన తల్లికి మించిన నాయకత్వ లక్షణాలు అన్షులో ఉన్నాయని యూనివర్శిటీ పురస్కారం నిరూపించింది గనుక.. తను కూడా భవిష్యత్ లో రాజకీయాల్లోకి వస్తారా? అన్నది చూడాలి.
