Begin typing your search above and press return to search.

రోహిత్‌ శర్మ చేసింది PR స్టంటా?

ఇటీవల జరిగిన క్రికెటర్ల అవార్డుల కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.

By:  A.N.Kumar   |   13 Oct 2025 12:08 PM IST
రోహిత్‌ శర్మ చేసింది PR స్టంటా?
X

టీమిండియా మాజీ సారథి రోహిత్‌ శర్మ మరోసారి సోషల్‌ మీడియాలో చర్చకు కేంద్రబిందువయ్యాడు. ఇటీవల జరిగిన క్రికెటర్ల అవార్డుల కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సంఘటనతో రోహిత్‌ చేసిన పని నిజమైన గౌరవ సూచకమా? లేక ప్రచారం కోసం చేసిన PR స్టంటా? అనే ప్రశ్నలు నెట్టింట్లో వేడెక్కుతున్నాయి.

*సంఘటన ఏంటి?

ఒక స్పోర్ట్స్‌ అవార్డుల ఫంక్షన్‌లో రోహిత్‌ శర్మ, అతని భార్య రితికా సజ్దేహ్‌, క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. నిర్వాహకులు పేరు పిలవడంతో అయ్యర్‌ అవార్డును స్వీకరించి వచ్చి, దానిని తన కుర్చీ పక్కన నేల మీద పెట్టాడు. రోహిత్‌ శర్మ వెనుక కూర్చుని ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన రోహిత్‌ భార్య రితికా వెంటనే అతని చెవిలో ఏదో చెప్పింది. ఆ వెంటనే రోహిత్‌ లేచి అయ్యర్‌ అవార్డును తీసుకుని టేబుల్‌పై ఉంచాడు. ఈ మొత్తం సంఘటన కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

* సోషల్‌ మీడియాలో ప్రతిక్రియలు

అవార్డుల విలువను అర్థం చేసుకున్న ఆటగాడు రోహిత్. క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా ఎంత గౌరవప్రదంగా ఉంటాడో ఈ చర్య చూపించిందని మెచ్చుకుంటున్నారు. ఒక అవార్డును నేలపై పెట్టడం సరికాదనే భావనతో రోహిత్ స్పందించాడని, ఇది ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుందని ప్రశంసిస్తున్నారు.

* విమర్శకుల వ్యాఖ్యలు

రోహిత్‌ భార్య రితికా సూచనతో మాత్రమే ఆ పని చేశాడని, స్వతంత్రంగా ఆ ఆలోచన రాలేదని చెబుతున్నారు. అందువల్ల ఇది స్పష్టమైన PR స్టంట్‌ అని, తన ఇమేజ్‌ను మెరుగుపరచుకునేందుకు చేసిన ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిజమైన గౌరవం ఉంటే, రితికా చెప్పకముందే లేచి చేసేవాడని విమర్శిస్తున్నారు.

* వాస్తవం ఏంటంటే...

వీడియోను గమనిస్తే రోహిత్‌ నిజంగా ఆ దృశ్యాన్ని ముందుగా గమనించలేదు. రితికా చెప్పిన తర్వాతనే స్పందించాడు. అయితే, అక్కడ పక్కనే ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఆ అవార్డును టేబుల్‌పై ఉంచాలని భావించి ఉండవచ్చు, కానీ తాత్కాలికంగా నేలపై పెట్టి ఉండవచ్చు. రోహిత్‌ వెంటనే దాన్ని టేబుల్‌పై ఉంచడం ద్వారా అవార్డుకు తగిన గౌరవం దక్కింది. అసలు ఆ చర్య వెనుక ఉద్దేశం ఏమిటో రోహిత్‌ శర్మ మాత్రమే చెప్పగలడు. కానీ సోషల్‌ మీడియాలో చిన్న సంఘటనలకే అతిశయోక్తి జోడించి, ఒకరి ఉద్దేశాన్ని విశ్లేషించడం ఇప్పుడు సాధారణమైపోయింది.

క్రికెట్‌లో ఎన్నో విజయాలు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రోహిత్‌ శర్మకు ఈ స్థాయి ప్రచారం అవసరమా? అన్నది అసలైన ప్రశ్న. అభిమానులు ఆయన చేసిన ప్రతి చిన్న పనినీ గౌరవంగా చూస్తారు.

* విమర్శకులు అదే పనిని PR స్టంట్‌గా చూపిస్తారు..

కానీ ఒక ఆటగాడి విలువ ఒక్క చిన్న వీడియోతో తగ్గిపోదు.. పెరగదు కూడా. రోహిత్‌ శర్మ చేసినది PR స్టంటా లేదా గౌరవ సూచకమా అన్నది వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంఘటన మాత్రం మరోసారి చూపించింది. సోషల్‌ మీడియా యుగంలో ప్రతి క్షణం, ప్రతి కదలిక కూడా విశ్లేషణకు గురవుతుందనే నిజాన్ని గుర్తించుకోవాలి.