వైరల్ వీడియో: వైట్ కాలర్ ఉద్యోగాలకు కూడా చెక్.. అసలు విషయం ఇదే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఆలోచనలను, భయాందోళనను బయటపెడుతోంది.
By: Tupaki Political Desk | 4 Dec 2025 8:00 PM ISTసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఆలోచనలను, భయాందోళనను బయటపెడుతోంది. యూఏఈలోని బిజినెస్ సెటప్ ప్రొఫెషనల్స్‌తో ఒక AI రోబో ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో అది. ఇది అందరినీ షాక్‌కు గురి చేసింది. మొదట చూస్తే ఇది సరదాగా కనిపించింది. కానీ వీడియో కాస్త ముందుకెళ్తే.. ఈ రోబో మాట్లాడే విధానం, ధైర్యం, చెప్పే లాజిక్, ఉద్యోగాలను నిమిషాల్లో భర్తీ చేయొచ్చన్న ధీమా అన్నీ ఒక్కొక్కటి నిజ జీవితానికి ఎంత దగ్గరగా వచ్చేశాయో గుర్తు చేస్తున్నాయి. ఈ వీడియోలోని మాటలు సరదాగా అనిపించినా.. వాటి వెనుకున్న వార్నింగ్ మాత్రం చాలా నిజం, చాలా ప్రమాదకరం.
వైట్ కాలర్ ఉద్యోగాలు కూడా సేఫ్ కాదు..
AI ఇప్పుడే కార్మిక ప్రపంచాన్ని మార్చేస్తోంది అని ఇన్నేళ్లుగా నిపుణులు చెప్పినా, వైట్ కాలర్ ఉద్యోగాలు మాత్రం సేఫ్ అని చాలా మందికి నమ్మకం ఉండేది. కానీ ఈ వీడియో ఆ నమ్మకాన్నే మొత్తం తుడిచిపెట్టింది. ఇప్పటి వరకు సేఫ్ అనుకున్న డెస్క్ వర్క్ కూడా ప్రమాదంలో పడిపోతున్నదన్న సంకేతం ఈ వీడియోతో బయటపడింది. వీడియోలో రోబో మాట్లాడే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘నాకు మెమరీ ఫెయిల్ కాదు.. నాకు అలసట లేదు.. నాకు నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టదు’ అని రోబో నిస్సంకోచంగా చెబుతుంది. ఎదుట కూర్చున్న ఉద్యోగి కంగారు పడుతున్నాడా..? వారి ముఖాలపై కనిపించే భయం, అనిశ్చితి అది నిజ జీవిత భయం. స్క్రీన్ మీద చూసినా ఆ టెన్షన్ అసలైనదే అనిపిస్తుంది.
సులువుగా సామాధానాలు
ఒక సమయంలో, ఒకరు UAE 9% కార్పొరేట్ ట్యాక్స్ గురించి అడిగారు. చాలా మంది ప్రొఫెషనల్స్ కూడా వెంటనే చెప్పలేని టెక్నికల్ వివరాలు.. రోబో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా క్లియర్‌గా చెప్పేస్తుంది. ఫ్రీ జోన్‌ల్లో వచ్చే ఆదాయం, ఆఫ్‌షోర్ ఇన్‌కమ్‌కు ఎలాంటి మినహాయింపులు ఉంటాయో. అది చెప్పే స్పీడ్, ఇచ్చే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే.. డేటా, రూల్స్, లాజిక్‌లో మనుషులు ఎప్పుడూ మిషన్లను గెలవలేరని అర్థం అవుతుంది.
కానీ వీడియోలో అసలు కిటుకు..
‘నేను ఐదు టీంల పని ఒంటరిగానే చేయగలను.. లంచ్‌కు ముందే అందరినీ రీప్లేస్ చేయగలను’ అని రోబో చెబుతుంది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇంత వేగంగా AI పెరుగుతోంది అంటే.. అసలు మనుషుల అవసరం తగ్గిపోతుందా? ఇది కేవలం ఈ వీడియోలోని జోక్ కాదు. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఇప్పటికే డేటా అనాలిసిస్, కస్టమర్ చాట్, లీగల్ డ్రాఫ్టింగ్, అకౌంటింగ్, మార్కెట్ ప్రిడిక్షన్ వంటి చాలా పనులకు AIని ఉపయోగించడం ప్రారంభించాయి. మిషన్‌కు లంచ్ బ్రేక్ అవసరం లేదు.. సెలవులు అవసరం లేదు.. జీతం, PF, ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఈ లెక్కల్లో మనిషి ఎలా పోటీ పడగలడు?
మనుసులేని ఏఐ..
AIకి మెదడు ఉంది, కానీ మనసు లేదు. వ్యాపారాల్లో నమ్మకం, భావోద్వేగం, అనుభవం, మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. క్లయింట్లు ఒక నిర్ణయం తీసుకునే ముందు తమ సమస్యను ఎవరో విని, అర్థం చేసుకొని, భరోసా ఇచ్చేలా మాట్లాడాలని కోరుకుంటారు. మిషన్లు ఈ సున్నితమైన భావాలను ఇప్పటికీ భర్తీ చేయలేవు. కానీ ఇందులో ఒక ప్రమాదకరమైన వార్నింగ్ దాగి ఉంది. ఉద్యోగాలు పోయే సమయం రానే వస్తుంది అన్నది కాదు.. అది ఇప్పటికే మొదలైంది. మార్పునకు ఆలస్యం చేసే కంపెనీలు వెనకబడిపోతాయి.మార్పునకు సిద్ధం కాని ఉద్యోగాలు క్షణాల్లో కాలం చెల్లినవైపోతాయి. AI డోర్ తట్టి లోపలికి రావడం కాదు.. అది నేరుగా లాగిన్ అవుతుంది. ఈ వీడియోలోని జోక్.. అసలు జోక్ కాదు. రేపటిని ముందే చూపించే అద్దం.
